MK Stalin: గాజాపై ఇజ్రాయిల్ దాడులు ఆపేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తక్షణ కాల్పుల విరమణకు పిలుపునివ్వాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గాజా అనుకూల నిరసనల్లో ఆయన పాల్గొన్నారు. ఇజ్రాయిల్ విచక్షణారహిత దాడుల్ని సీఎం ఖండించారు. గాజాకు శాంతి, మానవతా సాయం అందించే ప్రయత్నాలు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరుతూ అక్టోబర్ 14న తమిళనాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇది తమిళ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు.
Read Also: Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
గాజాపై ఇజ్రాయిల్ మారణహోమం ముగియాలని, రాజకీయాల కోసం ఈ నిరసనల్లో పాల్గొనలేదని, మానవత్వం కోసం పాల్గొన్నామని స్టాలిన్ అన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని ఖండిస్తూనే, పాలస్తీనియన్లకు మానవ హక్కుల మద్దతు ఉంటుందని చెప్పారు. గతేడాది గాజాలో 50,000 మంది మరణించారని, ఇందులో 26 వేల మంది పిల్లలు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇజ్రాయిల్ ప్రపంచ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
అయితే, 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం వర్గాన్ని ఆకర్షించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారనే విమర్శల్ని డీఎంకే తోసిపుచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. డీఎంకే ఎల్లప్పుడు అణిచివేతకు వ్యతిరేకంగా పనిచేస్తుందని, అది శ్రీలంక తమిళ కోసం అయినా, పాలస్తీనా కోసమైనా అని అన్నారు. మరోవైపు మిత్రపక్షాలైన కాంగ్రెస్ వంటి పార్టీల నుంచి కూడా సీఎంకు మద్దతు వచ్చింది. కాంగ్రెస్ ఎల్లప్పుడు పాలస్తీనాకు సపోర్ట్‌గా నిలబడిందని ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ కే. సెల్వపెరుంతగై అన్నారు.
