ఇటీవల రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మహ్మద్ అజారుద్దీన్‌కు ప్రభుత్వం శాఖలు కేటాయించింది. రాష్ట్ర అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను ఆయనకు కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటివరకు మైనారిటీ సంక్షేమ శాఖ.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వద్ద, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ.. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద ఉండేవి. అజారుద్దీన్ మంత్రిగా అక్టోబరు 31న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్-విజయవాడ హైవే 6 వరుసల విస్తరణకు నోటిఫికేషన్
హైదరాబాద్-విజయవాడ మధ్య 65వ జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ రహదారిలో 40 నుంచి 269 కిలోమీటరు వరకు మొత్తం 229 కి.మీ. పొడవున నాలుగు నుంచి ఆరు వరుసలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ కోసం తెలంగాణ, ఏపీల్లో అధికారులను నియమిస్తూ కేంద్ర రహదారి, రవాణాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని 9 గ్రామాల్లో, నల్గొండ జిల్లాలోని చిట్యాలలో 5, నార్కెట్‌పల్లిలో 5, కట్టంగూర్‌లో 4, నకిరేకల్‌లో 2, కేతేపల్లిలో 4, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలంలో 4, చివ్వెంలలో 6, కోదాడ మండలంలో 4, మునగాల మండలంలోని 5 గ్రామాల్లో భూసేకరణ బాధ్యతలను అక్కడి ఆర్డీఓలకు అప్పగించారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ మండలంలో 4, కంచికచర్లలో 4, జగ్గయ్యపేటలో 7, పెనుగంచిప్రోలులో 3, ఇబ్రహీంపట్నంలో 12, విజయవాడ రూరల్‌లో 1, విజయవాడ వెస్ట్‌లో 2, విజయవాడ నార్త్ పరిధిలోని 1 గ్రామంలో భూసేకరణ చేపట్టే బాధ్యతలను అక్కడి జాయింట్ కలెక్టర్లకు అప్పగించారు.
The post Mohammed Azaruddin: మైనారిటీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖా మంత్రిగా అజారుద్దీన్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
