ఉత్కంఠ భరితంగా సాగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. 243 సీట్లలో పోటీ చేసిన ఎన్డీఏ కూటమి దాదాపు 203 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే బిహార్ లో ఎన్డీఏ కూటమికి చెక్ పెట్టడానికి రంగంలోనికి దిగిన ఆర్జేడీ నేతృత్వంలోని మహాగడ్బంధన్ కేవలం 34 స్థానాలతో ఘోర పరాజయం చవిచూసింది. ఇందులో ఆర్జేడీ 24 స్థానాలను కైవసం చేసుకోగా… కాంగ్రెస్ కేవలం ఆరు స్థానాలకే పరిమితం అయింది. ఇతరులు ఆరు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించగా… ఎంతో మందిని సీఎంలుగా చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్… స్వంత పార్టీ జన్ సురాజ్ మాత్రం కనీసం ఖాతా తెరవలేకపోయింది.
బిహార్ లో ఎన్డీఏ కూటమి విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రభుత్వానికి ప్రజామోదం ఉండటం వల్లే బిహార్‌లో ఘనవిజయం సాధించామని అన్నారు. బిహార్‌లో ఎన్డీయే సర్కార్ అఖండ విజయం సాధించడంతో ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధానికి పార్టీ కార్యాలయం వద్ద ఘనస్వాగతం లభించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ ఎన్డీయే సుమారు 203 సీట్లు కైవసం చేసుకోగా.. తేజస్వి సారథ్యంలోని మహాగఠ్‌బంధన్ కేవలం 34 సీట్లతో ఘోర వైఫల్యాన్ని చవిచూసింది.
కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదు
బిహార్ ప్రజలు ఎన్డీయేకు చారిత్రక తీర్పు ఇచ్చారని ప్రధాని తన ప్రసంగంలో పేర్కొన్నారు. కట్టా సర్కార్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదని విపక్ష కూటమికి చురకలు అంటించారు. భవిష్యత్తులో అసాధారణమైన అభివృద్ధిని రాష్ట్రం చూడనుందని భరోసా ఇచ్చారు. ఎన్డీయేకు 2010 తర్వాత అసాధారణమైన తీర్పును ఈరోజు ప్రజలు ఇచ్చారని, ఎన్డీయేలోని అన్ని పార్టీల తరఫున తాను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. బిహార్‌లోని కొన్ని పార్టీలు బుజ్జగింపు రాజకీయాల కోసం మహిళలు, యూత్ (MY)ను వాడుకునే వారని, అయితే ఈ ఫార్ములా ఇప్పుడు బెడిసికొట్టిందని అన్నారు.
దేశంలో యువ జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటని, ఇందులో అన్ని కులాలు, మతాలకు చెందిన వారున్నారని మోదీ చెప్పుకొచ్చారు. వారి కోరికలు, ఆకాంక్షలు, కలలకు గతంలోని జంగిల్‌రాజ్ సర్కార్ గండికొట్టిందని చెప్పారు. ఇప్పుడు ప్రజలు బిహార్ అభివృద్ధికి ఓటు వేశారని అన్నారు. తన ప్రచారంలో రికార్డు స్థాయిలో ఓటింగ్‌లో పాల్గొనాలని తాను విజ్ఞప్తి చేశానని, అందుకు తగినట్టుగానే అన్ని రికార్డులను ఓటర్లు బ్రేక్ చేశారని ప్రశంసించారు. గౌరవప్రదమైన బీహార్‌కే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
25 ఏళ్లకే అసెంబ్లీలో అడుగుపెట్టనున్న సింగర్ మైథిలీ ఠాకూర్ !
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ సింగర్ మైథిలీ ఠాకూర్ ఘనవిజయం సాధించింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే జానపద సింగర్ ఎమ్మెల్యేగా ఎంపికైంది. బీజేపీ నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన మైథిలి ఠాకూర్ విక్టరీ సాధించింది. బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన సింగర్ మైథిలీ ఠాకూర్.. అలీనగర్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనుంది. ఈ ఎన్నికల్లో దాదాపు 11 వేలకు పైగా మెజార్టీలో గెలుపొందింది. వాస్తవానికి 2008లో అలీనగర్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి బీజేపీ ఇక్కడ విజయకేతనం ఎగురవేసింది.
కాగా.. 25 ఏళ్ల మైథిలి ఠాకూర్… బీహార్‌లోని మధుబన్ జిల్లా బెనిపట్టి ఆమె సొంతూరు. జానపద సింగర్‌గా శిక్షణ తీసుకున్న మైథిలి పలు రియాలిటీ షోల్లో పాల్గొంది. స రే గ మ ప లిటిల్ చాంప్స్, ఇండియన్ ఐడల్ జూనియర్, రైజింగ్ స్టార్ రియాలిటీ షోలలో కంటెస్టెంట్‌గా రాణించింది. మైథిలి సొంత యూట్యూబ్ ఛానెల్‌కు 5 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు 6.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. తన గాత్రంతో అందరినీ ఆకట్టుకున్న మైథిలి.. ఇప్పుడు రాజకీయ నాయకురాలిగా ఎలా రాణిస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
The post NDA: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
