Off The Record: తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెడ్‌బుక్కే హాట్ టాపిక్. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక కూడా చాలా రోజులు చర్చంతా దాని చుట్టూనే తిరిగింది. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమసు చేస్తున్నారని, దాని ప్రకారం తమ కేడర్‌ని తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ పెద్దలు. అందుకు కౌంటర్‌గా…. కార్యకర్తల కోసం డిజిటల్ బుక్‌ని లాంఛ్ చేసింది వైసీపీ అధిష్టానం. వాళ్ళు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఏ సహాయం అవసరమైనా… క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వెంటనే పార్టీ కేంద్ర కార్యాలయానికి సమాచారం అందేలా యాప్‌ను డిజైన్ చేశారు. డిజిటల్ బుక్‌లో నమోదైన ప్రతి ఫిర్యాదుకు ఓ లెక్క ఉంటుందని, రేపు అధికారంలోకి వచ్చాక వేధించిన వాళ్ళకు చట్ట ప్రకారం చుక్కలు చూపిస్తామని లాంఛ్ సందర్భంలో ప్రకటించారు వైసీపీ పెద్దలు. అంత వరకు బాగానే ఉన్నా… ఆ తర్వాతే అసలు సమస్య మొదలైందట. అధికార పార్టీ వేధింపులకు గురైన వాళ్ళు డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేయడం ఒక ఎత్తయితే… అంతకు మించి సొంత పార్టీ నాయకుల మీదే ఫిర్యాదులు వెల్లువెత్తడం అధిష్టానాన్ని ఇరుకున పడేస్తోందట. మాజీ మంత్రి విడదల రజని, మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మీద డిజిటల్ బుక్‌లో ఫిర్యాదులు నమోదవడం చూసి పార్టీ ముఖ్యులు షాకైనట్టు సమాచారం. మనం డిజిటల్ బుక్‌ని పెట్టింది దేని కోసం, ఇప్పుడు జరుగుతోంది ఏంటంటూ పార్టీ సర్కిల్స్‌లో గట్టి చర్చే జరుగుతోందట. పార్టీ యాప్‌లో సొంతోళ్ళ మీదే ఫిర్యాదులు రావడం కలకలం రేపుతోంది.
దీంతో అవి నిజమైన ఫిర్యాదులా? లేక పొలిటికల్ మోటివ్ ఉందా అన్న కోణంలో కూడా ఎంక్వైరీ మొదలైంది. చిలకలూరిపేటకే చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి విడదల రజనీ మీద ఫిర్యాదు చేశారు. పేటలోని తన కార్యాలయం,ఇల్లు, కారు మీద 2022లో విడదల వర్గీయులు దాడి చేశారంటూ… అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అప్‌లోడ్ చేశారాయన. మాజీ మంత్రి మీద పార్టీ పరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు రావు సుబ్రహ్మణ్యం. దీనికి జగన్ స్పందించి తనకు న్యాయం చేయాలని,. తనకు న్యాయం జరిగితే జగన్ చెప్పినట్టు వైసీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందని మీడియాకు చెప్పారు నవతరం పార్టీ అధ్యక్షుడు. ఇక, తాజాగా వైసీపీ హయాంలో తమకు అన్యాయం జరిగిందని.. న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే దిక్కంటూ ఫిర్యాదు చేశారు శ్రీ సత్యసాయి జిల్లా చెందిన బాధితులు. మడకశిర మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి అన్యాయం చేశారని ఇద్దరు బాధితులు డిజిటల్ బుక్‌లో మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానంటూ… తిప్పేస్వామి తన దగ్గర 25 లక్షలు తీసుకున్నట్టు కౌన్సిలర్ ప్రియాంక, ఆమె తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. తిరిగి డబ్బులు అడిగితే పార్టీకోసమే ఖర్చుచేశానని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోమని బెదిరిస్తున్నారని, న్యాయం జరక్కుంటే… మా కుటుంబానికి ఆత్మహత్యలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే అంగన్‌వాడి హెల్పర్ ఉద్యోగం కోసం తిప్పేస్వామికి 75 వేలు ఇచ్చినట్టు ఆగలి మండలం దొక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు కూడా డిజిటల్ బుక్‌లో కంప్లయింట్ చేశారు. తర్వాత ప్రమోషన్ రావడంతో మళ్లీ 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఇలా… లాంఛ్ చేసిన 14 రోజుల్లోనే ఇద్దరు ముఖ్య నేతలపై ఫిర్యాదులు రావడం వైసీపీ హైకమాండ్‌కు కూడా ఇబ్బందిగా మారుతోందట. ఇది ఇక్కడితో ఆగక పోవచ్చని… మెల్లిగా సొంతోళ్ళమీదే ఫిర్యాదులు వెల్లువెత్తితే…మొదటికే మోసం వస్తుందన్న కంగారు మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో ఇంకెంతమంది వైసీపీ నాయకుల మీద ఫిర్యాదులు వస్తాయోనని రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. యాప్ ఆవిష్కరించినప్పుడే అందులోని లోపాలను గుర్తించారు నిపుణులు. బాధితులు కాకుండా… ఎవరంటే వారు నిరాధారమైన ఫిర్యాదులు చేసినా…. ఏది నిజమో, ఏది అబద్దమో తేల్చుకోవడానికే టైం సరిపోదని అప్పుడే అన్నారు. అయితే యాప్ ప్రాధమిక దశలో ఉన్నందున లోటుపాట్లను గుర్తించి సవరించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాయి వైసీపీ వర్గాలు. అయితే పార్టీ ముఖ్య నేతలపై వచ్చిన ఫిర్యాదులనూ కూడా సీరియస్‌గా పరిగణించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. అలాగే… కేవలం పార్టీ కార్యకర్తల గుర్తింపు కార్డులతో ఫిర్యాదులు స్వీకరించాలా.. లేక అందరు బాధితుల నుంచి తీసుకోవాలా అనే అంశంపై చర్చ జరుగుతోందట పార్టీలో. ఇప్పుడే జాగ్రత్తలు తీసుకోకుంటే… కొండ నాలుక్కి మందేస్తే…ఉన్న నాలుక ఊడిన చందంగా తయారవుతుందన్న భయం కూడా ఉందట వైసీపీ పెద్దల్లో.
మొత్తం మీద డిజిటల్ బుక్ తమకే రివర్స్ అవకుండా వైసీపీ అధిష్టాం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
