Off The Record: హుజూర్‌నగర్ బీజేపీలో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. నేతల మౌనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట ద్వితీయశ్రేణి నాయకులు. మరీ ముఖ్యంగా నల్లగొండ పార్లమెంట్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓడిపోయిన… హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి పట్టీ పట్టనట్టుగా ఉండటం చూసి ఏం చేయాలో పాలుపోవడం లేదట కేడర్‌కు. 2019లో హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు సైదిరెడ్డి.. 2023 లోకూడా బీఆర్ఎస్ నుండి హుజూర్ నగర్ అభ్యర్దిగా బరిలోకి దిగి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల్లో… కారు దిగి కాషాయ కండువా కప్పుకున్నారాయన. రాగానే… నల్గొండ ఎంపీ టిక్కెట్ ఇచ్చింది బీజేపీ. కానీ గెలుపు దక్కలేదు. వరుస ఓటముల తర్వాత ఇటు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన హుజూర్ నగర్ నియోజకవర్గంతోపాటు అటు ఎంపీగా ఎన్నికల బరిలోకి దిగిన నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గంతో కూడా అంటీ ముట్టనట్లే ఉంటున్నారాయన. మాజీ ఎమ్మెల్యే రాకతో ఇటు హూజూర్ నగర్, అటు నల్లగొండలో పార్టీ బలపడుతుందనుకున్న కమలం నేతలకు తీవ్ర నిరాశే మిగిలిందని అంటున్నారు. పార్టీ బలోపేతానికిగానీ, క్యాడర్‌లో జోష్ నింపేందుకుగానీ.. ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకపోవడం, ఒకవేళ చేసినా మమ అనిపించడంపై క్యాడర్ గుర్రుగా ఉందట.
స్థానిక ఎన్నికల హడావిడిలోనూ ఆయన చొరవ తీసుకోకపోవడంపై అసంతృప్తి పెరుగుతున్నట్టు తెలుస్తోంది. శానంపూడి సైదిరెడ్డి ఎప్పుడు సై అంటాడోనని వేచి చూస్తున్న క్యాడర్ కు ఆ జాడలేవీ కనిపించకపోగా… టోటల్ సైలెన్స్ కావడంతో… ఏమయ్యా బాలూ…. నీవల్ల ఉపయోగం అన్న సినిమా డైలాగ్‌ని గుర్తు చేసుకుంటున్నారట కార్యకర్తలు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన్ని పార్టీలోకి తీసుకువచ్చేందుకు పైరవీలు చేసిన వారు, వచ్చాక రెడ్ కార్పెట్ పరిచిన నేతలంతా తాజా పరిణామాలతో తలలు పట్టుకుంటుండగా….అప్పట్లో వలస నేతలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని గట్టిగా వాదించిన నేతలు మాత్రం… అయ్యిందా.. మీకు బాగా అయ్యిందా? తిక్క కుదిరిందా? అంటూ చురకలంటిస్తున్నారట. ఇంకొందరైతే… ఓ అడుగు ముందుకేసి హ… ఇలాంటివి ఎన్నిచూశాం అని ఓపెన్‌గానే కామెంట్స్ చేస్తున్నారట. వలస నేతలకు నల్లగొండ పార్లమెంట్, అసెంబ్లీ స్దానాలు కేరాఫ్ అయిపోయాయని, ఫలితంగా పార్టీ దెబ్బతింటోందని కాషాయం పార్టీ నేతలు కొంచెం కటువుగానే విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో చివరి క్షణం దాకా… పార్టీ పాత వాళ్ళకు టిక్కెట్ ఆశలు పెట్టి.. చివర్లో వలస నేతలను తెచ్చి నెత్తిన పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని ఫైర్ అవుతున్నారు కరుడుగట్టిన కాషాయం నేతలు… శానంపూడి వెంట కారు పార్టీ నేతలు ఎవరూ కాషాయ పార్టీలోకి రాకపోవడం, ఆయన సమీప బంధువులంతా బీఆర్ఎస్ లోనే ఉండటం కూడా బీజేపీ నేతల అనుమానాలకు మరో కారణంగా తెలుస్తోంది. ఇక సూర్యాపేట జిల్లా బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, తాజా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి హూజూర్ నగర్ నియొజకవర్గానికి చెందిన వారే కావడం, ఈ ఇద్దరు నేతలతో సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏర్పడ్డ వైరం కారణంగా అనువుగానీ చోట అధికులమనరాదన్న సూక్తిని పాటిస్తున్నట్టు చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే అనుచరులు.
