OTT | థియేటర్లలో చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ విత్ లవ్ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. యువ నటులు అభిషన్ జీవింత్ మరియు అనస్వర రాజన్ జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.10 కోట్ల క్లబ్‌లో చేరి బాక్సాఫీస్ వద్ద సర్ప్రైజ్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. నేటి(మార్చి 6) నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
విడుదలకు ముందు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినా, థియేటర్లలో విడుదలైన తర్వాత మంచి మౌత్ టాక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా యువత ఈ చిత్రానికి బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్ల పరంగా కూడా మంచి ఫలితాలు సాధించింది. ఈ చిత్రానికి దర్శకుడు మదన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌తో కలిసి నిర్మాతలు నజరత్ పసిలియన్ మరియు మహేశ్ రాజ్ పసిలియన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్‌లతో పాటు కావ్య అనిల్, సచిన్ నాచియప్పన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్ర కథ ప్రధానంగా ప్రేమ, స్నేహం, గుర్తులు అనే భావాల చుట్టూ తిరుగుతుంది. డిజైనర్ అయిన సత్య (అభిషన్ జీవింత్) పెళ్లి చూపులకు వెళ్తాడు. అక్కడ పెళ్లి కూతురు స్కూల్ రోజుల్లో తనకు రెండేళ్ల జూనియర్ అయిన మనీషా (అనస్వర రాజన్) అని తెలిసి ఆశ్చర్యపోతాడు. ఈ పరిచయం ఇద్దరినీ తమ పాత స్కూల్ డేస్‌ను గుర్తు చేసుకునేలా చేస్తుంది. స్కూల్ రోజులలో సత్య అనీషా (కావ్య అనిల్)ను ఇష్టపడుతుండగా, మనీషా మాత్రం బాలాజీ (సచిన్ నాచియప్పన్)పై ప్రేమ పెంచుకుంటుంది. కానీ ఇద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఎవరితోనూ చెప్పకుండా మనసులోనే దాచుకుంటారు. కాలం గడిచిన తర్వాత పెళ్లి చూపుల సందర్భంలో కలుసుకున్న సత్య, మనీషా తమ గత ప్రేమలను గుర్తు చేసుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంటారు. తాము ప్రేమించిన వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారిని కలిసి తమ మనసులోని మాట చెప్పాలని అనుకుంటారు. అయితే తర్వాత ఏమైంది? సత్య, మనీషా పెళ్లి చూపులు చివరికి ఎలా మారాయి? వారు తమ పాత ప్రేమికులకు నిజం చెప్పగలిగారా? లేక చివరికి వీరిద్దరి మధ్యే ప్రేమ చిగురించిందా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.
