Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన నేపథ్యంలో, ఈ సినిమాపై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘ఓజి’ సినిమాతో భారీ విజయం అందుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీలీల, టాలెంటెడ్ నటి రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సాంకేతికంగా కూడా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ పాటలకు స్వరాలు సమకూర్చగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. తమన్ నేపథ్య సంగీతాన్ని అందించడం విశేషం. విజువల్స్ పరంగా సినిమా రిచ్‌గా ఉండేలా చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. సినిమా విడుదలకు ముందే సోషల్ మీడియాలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మేనియా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లలో పవన్ కళ్యాణ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగులు, ఆయన మ్యానరిజమ్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
తెల్లవారుజామున 5 గంటల నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. మరోవైపు ఓవర్సీస్లో ఇప్పటికే షోలు ప్రారంభమవడంతో నెటిజన్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించి గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్లో నిర్మాత నవీన్ యెర్నేని స్పందిస్తూ అన్ని పుకార్లకు చెక్ పెట్టారు. సినిమా ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా, పవన్ కళ్యాణ్ కేవలం మొదట ఇచ్చిన అడ్వాన్స్ తప్ప ఇప్పటివరకు రెమ్యూనరేషన్ కింద ఒక్క రూపాయి కూడా అదనంగా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పనుల కారణంగా షూటింగ్ ఆలస్యమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తమపై ఒత్తిడి తీసుకురాలేదని తెలిపారు. షూటింగ్ జరగని సమయంలో ఆయన ఒక్క పైసా కూడా ఆశించలేదని చెప్పడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
