అంతరిక్షంలో అడుగుపెట్టిన ఆధునిక యుగంలోనూ… విద్యుత్ సౌకర్యానికి దూరంగా ఉన్న ‘గూడెం’ గ్రామం తొలిసారి విద్యుత్ కాంతులతో మెరిసింది. ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చొరవతో కేంద్ర ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల కృషితో దశాబ్దాల నాటి గిరిపుత్రుల కల సాకారమైయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామం… మండల కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో 17 ఆవాసాలతో ఉంది. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వసతులు లేవు. బాహ్య ప్రపంచంతో వీరి సంబంధాలు అంతంత మాత్రమే. పగటి వేళల్లో ఉపాధి కోసం బయటకు వచ్చే ఈ గ్రామస్థులు… రాత్రిళ్లు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు.
ఐదు నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తమ సమస్యలను విన్నవించుకున్నారు. దీనితో ఈ గ్రామానికి విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని అధికారులను పవన్ ఆదేశించారు. 17 ఆవాసాల కోసం 9.6 కిలోమీటర్ల పొడవునా అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలని, ఇందుకోసం రూ.80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానళ్లను సైతం ఏర్పాటు చేసి ట్రాన్స్ ఫార్మర్‌కి అనుసంధానం చేశారు. పీఎం జన్మన్ పథకం కింద రూ.10.22 లక్షలతో సోలార్, పవన విద్యుత్ తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారి ఈ తరహా గ్రిడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికీ ఐదు బల్బులు, ఒక ఫ్యాన్ కూడా అందించింది.
పవన్ చిత్రానికి పాలాభిషేకం చేస్తూ గూడేం వాసుల హర్షాతిరేకాలు
తమకు విద్యుత్ సౌకర్యం రావడంతో గూడెం ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమ గ్రామంలో మొట్టమొదటిసారి విద్యుత్ వెలుగులు చూసి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. గ్రామానికి విద్యుత్ లైను వేయించి, తమ ఇళ్ళలో విద్యుత్ కాంతులు నింపిన పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గ్రామాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అరకు జనసేన నేతలు, పలువురు జనసైనికులు సందర్శించారు. కనీసం రహదారి సౌకర్యం లేని ఆ గిరి శిఖర గ్రామానికి చేరుకొని గ్రామస్థులతో ఆనందాన్ని పంచుకున్నారు.
రూ.2 వేల కోట్ల సాస్కీ నిధులతో రోడ్ల నిర్మాణం
గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణం కోసం సాస్కీ (రాష్ట్ర మూలధన పెట్టుబడులపై ప్రత్యేక సహాయం) పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.2 వేల కోట్లు సమకూర్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ వెల్లడించారు. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పటిష్ఠంగా రహదారులు నిర్మించాలని పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. సాస్కీ నిధుల వినియోగంపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో సమన్వయంతో ముందుకెళ్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధతో తీసుకొచ్చిన నిధులివి. వీటి ఫలాలు ప్రజలకు అందించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంపై ఉంది.
ప్రతి నియోజకవర్గంలోనూ రోడ్లు మెరుగుపడేలా నిధులు సమకూరుస్తున్నాం. నాణ్యతపై రాజీ పడొద్దు. రహదారుల నిర్మాణంలో ప్రమాణాలు పాటిస్తున్నారో, లేదో పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నిర్మాణం మొదలయ్యాక పలు దశల్లో నాణ్యత పరిశీలించాలి. నేను, నిపుణులు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీ చేస్తాం. ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేయకపోతే అధికారులు, ఇంజినీర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు. ప్రతి గ్రామానికీ రహదారులు ఉండాలి. మౌలిక సదుపాయాల కల్పనలో రహదారులు ఎంతో కీలకం. ప్రత్యేకమైన ప్రాంతాల్లో, సందర్భాల్లో సాస్కీ నిధులను అభివృద్ధి పనులకు ఖర్చు చేయాలి’ అని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.
పుట్టపర్తిలో మౌలిక వసతులకు రూ.35 కోట్లు
‘సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా పంచాయతీరాజ్ రోడ్లు పటిష్ఠపరచాలి. ఇందుకోసం సాస్కీ పథకం నుంచి రూ.35 కోట్లు వెచ్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యంతో వ్యవహరించింది. కేంద్రం నుంచి నిధులు వచ్చే వెసులుబాటు ఉన్నా విస్మరించింది. కూటమి ప్రభుత్వం కేంద్రం సహకారంతో వివిధ అభివృద్ధి పనులకు నిధులు సాధిస్తోంది. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నిధులు పొందడంలో, వాటిని వినియోగించే ప్రక్రియలో సీఎం చంద్రబాబు తగిన సూచనలు అందిస్తున్నారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించాలన్న కృతనిశ్చయంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఇందులో అధికార యంత్రాంగం కీలక భూమిక పోషించాలి’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు.
The post Pawan Kalyan: పవన్ కల్యాణ్ చొరవతో ‘గూడెం’కు విద్యుత్ వెలుగులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
