PCB | సిటీ బ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) ; కాలుష్య నియంత్రణ మండలిలో నిధుల గోల్‌మాల్ యథేచ్ఛగా జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ పెద్దల జోక్యం పెరిగిపోయి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తూ తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు టెండర్లు వచ్చేలా చూస్తున్నారు. ఇటీవల ఆ డిపార్ట్‌మెంట్‌కు చెందిన రూ.50 లక్షల పనులకు సంబంధించిన కాంట్రాక్టును ఓ ఆంధ్రా కాంట్రాక్టర్‌కు ఎలాంటి టెండర్ లేకుండా అప్పజెప్పినట్ల్లు సమాచారం. ఇందులో ప్రభుత్వ పెద్దల ‘హస్తం’ ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
వాయు కాలుష్యం, ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు బస్‌స్టాండ్లు, ప్రధాన కూడళ్లలో ప్రచారానికి.. కాలుష్య నియంత్రణ మండలి గతేడాది రూ.50 లక్షలు కేటాయించింది. ప్రభుత్వ విభాగాల్లో నిబంధనల ప్రకారం రూ.5 లక్షల కంటే ఎకువ మొత్తానికి సంబంధించిన పనులు చేపట్టాల్సి వస్తే బహిరంగ టెండర్లు ఆహ్వానించాలి. అందులో తకువ మొత్తానికి (ఎల్-1) కోడ్ చేసినవారికి పనులు అప్పగించాల్సి ఉంటుంది.
ఆ పనులకు సంబంధించిన మిగతా
టెండర్ ప్రక్రియ బహిరంగంగా టెండర్ దారులందరి ముందూ చేయాల్సి ఉంటుంది. అయితే పీసీబీ కార్యాలయంలో ఈ టెండర్ ప్రక్రియ లేకుండానే రూ.50 లక్షల విలువైన పనులను ఆంధ్రాకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు కేటాయించినట్లు సమాచారం. రాష్త్రంలోని 30 ఆర్టీసీ బస్టాండ్లతోని టీవీల్లో ప్రకటనలు ఇవ్వనున్నారు. ఈ ప్రకటనలు 30 రోజుల పాటు వస్తాయని తెలిసింది.
ప్రకటనలకు రూ.50 లక్షలా?
ప్రస్తుత పరిస్థితుల్లో బస్టాండుల్లో టీవీల నెట్‌వర్ అంతంతమాత్రంగానే పనిచేస్తున్నది. కొన్ని బస్టాండ్లలో అసలు టీవీలు పనిచేయవు. ఒకవేళ పనిచేసినా అకడ టీవీల్లో ప్రకటన చూసిన వారిలో ఎంతమందిలో మార్పు వస్తుందో అధికారులకే తెలియాలి. రూ.50 లక్షలు వెచ్చించినప్పుడు విభిన్న కోణాల్లో ప్రచారం చేపట్టాల్సి ఉంటుంది. స్థానికంగా ప్రభావం చూపించే నేతలు, అధికారులతో అవగాహన సదస్సులు, ర్యాలీలు చేపడితే ఎంతోకొంత ఉపయోగకరంగా ఉంటుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాంటివి ఏవీ చేయకుండా ప్రభుత్వ పెద్దల సన్నిహితుల సంస్థలకు కాంట్రాక్ట్‌లు ఇప్పించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని ఆందోళన చెందుతున్నారు.
