PM Modi Srisailam Tour: నేడు శ్రీశైలంలో ప్రధాని మోడీ పర్యటనకు సర్వం సిద్ధమైంది.. మోడీ పర్యటనకు కేంద్ర భద్రతా బలగాల పర్యవేక్షణ కొనసాగుతోంది.. శ్రీశైల క్షేత్రం భద్రతావలయంలో ఉంది. ప్రధాని మోడీ పర్యటన పూర్తయ్యే వరకు శ్రీశైలంలో రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ శ్రీశైలం వెళ్లే దారులలో ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. శ్రీశైల జ్యోతిర్లింగం, భ్రమరాంబికా శక్తిపీఠాన్ని దర్శించుకున్న ఐదవ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలవనున్నారు.. గతంలో ప్రధానులు నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావులు ఈ క్షేత్రాన్ని సందర్శించారు.. ఈ నేపథ్యంలో ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకనున్నారు. కాశీ, ఉజ్జయిని తరహాలో శ్రీశైల మల్లన్న ఆలయ అభివృద్ధికి రూపొందించిన నివేదికను ప్రధానమంత్రి నరేంద్రమోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారు.. శ్రీశైల దేవస్థాన అభివృద్ధికి 5400 ఎకరాల భూమిని అటవీశాఖ అభ్యంతరాలు లేకుండా కేటాయించాలని నివేదిక ద్వారా కోరనున్నారు.
READ MORE: Naveen Reddy : మిస్టర్ టీ యజమాని నవీన్ రెడ్డికి 6 నెలల నగర బహిష్కరణ
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన షెడ్యూల్..
ఉదయం 07.20 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రత్యేక ఐఏఎఫ్ ఎంబ్రార్ విమానంలో బయలుదేరుతారు. 10:20 గంటలకు కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయానికి చేరుకుంటారు. 10:25 గంటలకు ఎంఐ-17 హెలికాప్టర్లో బయలుదేరి శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 11:15 గంటలకు సున్నిపెంట నుంచి రోడ్డుమార్గంలో శ్రీశైలం లోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకుని, కొద్ది సేపు విరామం తీసుకుంటారు. 11:45 గంటలకు శ్రీశైలం ప్రధాన ఆలయానికి చేరుకుని… భ్రమరాంబ, మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. 1:35 గంటలకు సున్నిపెంట నుంచి హెలికాప్టర్లో కర్నూలుకు బయలుదేరతారు. 2:20 గంటలకు కర్నూలు నగర శివారులో రాగమయూరి గ్రీన్ హిల్స్ లో సభా ప్రాంగణం సమీపంలో ఏర్పా టు చేసిన హెలీప్యాడ్ కు చేరుకుంటారు. 2:30 నుంచి 4:05 గంటల వరకు అభివృద్ధి పనులకు శంకు స్థాపన, బహిరంగ సభలో పాల్గొంటారు. 4:20 గంటలకు హెలికాప్టర్ కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు. 4:45 గంటలకు విమానంలో ఢిల్లీకి బయలుదేరతారు..
