Pothole | లక్నో: గుంతలు ప్రాణాలు తీయడమే కాదు.. పోయిన ప్రాణాలను తిరిగి తెస్తుందని ఈ ఘటన చూస్తే ఎవరికైనా అన్పిస్తుంది. యూపీలో బ్రెయిన్ డెడ్ అయిన ఒక మహిళను అంబులెన్స్‌లో తీసుకువస్తుండగా ఆ వాహనం గుంతలో పడటంతో ఆమె ఒక్కసారిగా శ్వాస తీసుకోవడం ప్రారంభించింది.
వివరాల్లోకి వెళితే.. పిలిభిత్ జిల్లాలోని కోర్టులో వినీతా శుక్లా అనే మహిళ కాపీయిస్టుగా పనిచేస్తున్నది. అయితే సుమారు 15 రోజుల క్రితం ఆమె పాముకాటుకు గురవ్వడంతో ఆమె భర్త కులదీప్ శుక్లా ఆమెను తొలుత ప్రభుత్వ దవాఖానకు, తర్వాత బరేలిలోని ఒక ప్రైవేట్ దవాఖానలో చేర్చారు. డాక్టర్లు ఆమెకు చికిత్స చేసినప్పటికీ లాభం లేకపోవడంతో బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించి ఇంటికి తీసుకుపోవాలని చెప్పారు. దీంతో పిలిభిత్‌లోని కుటుంబ సభ్యులకు కులదీప్ సమాచారం ఇవ్వడంతో వారు అక్కడ ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వినీత మృతదేహంతో కుల్‌దీప్ అంబులెన్స్‌లో ఊరికి బయలుదేరాడు.
దారిలో బరేలీలోని హఫీజ్‌గంజ్ వద్ద వారి అంబులెన్స్ చక్రం పెద్ద గోతులో పడటంతో వాహనం పెద్ద కుదుపునకు గురైంది. తర్వాత సర్దుకుని చూడగా, వినీత శరీరంలో కదలికలు గమనించారు. దీంతో వారు అంబులెన్స్‌ను తిరిగి దవాఖానకు తీసుకువచ్చారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఇంటికి తీసుకువచ్చారు. 13 రోజుల తర్వాత ఆమె ఇప్పుడు చలాకీగా కొడుకు, కోడలు, కుమార్తెతో ఆనందంగా ముచ్చట్లు పెడుతూ కన్పించింది.
