Prabhas Fans |ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ మరి కొద్ది నిమిషాలలో థియేటర్స్‌లోకి రానుంది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పడడంతో ఓవర్సీస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల ఉత్సాహం తారస్థాయికి చేరింది. గురువారం (జనవరి 8) రాత్రి నుంచే థియేటర్లలో సినిమా ప్రదర్శనలు మొదలవ్వడంతో డార్లింగ్ అభిమానులు పండగ వాతావరణాన్ని సృష్టించారు. థియేటర్ల చుట్టూ భారీ కటౌట్లు, పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేస్తూ ప్రభాస్‌కు తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు.ఈ సందడిలో భాగంగా కొన్ని చోట్ల అభిమానులు చేసిన హంగామా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చర్చకు దారి తీసింది.
ఓ థియేటర్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ పెద్ద సైజ్ రబ్బరు మొసళ్లను చేతబట్టి హాల్ మొత్తం తిరుగుతూ సందడి చేశారు. మొదట వీడియో చూసినవారు నిజమైన మొసళ్లనే థియేటర్‌లోకి తీసుకువచ్చారని అనుమానించినా, అవి రబ్బరుతో చేసిన బొమ్మలని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రభాస్ అభిమానుల క్రేజ్‌కు మరో ఉదాహరణగా మారింది. కొందరు దీనిని ఫన్‌గా తీసుకుంటే, మరికొందరు “ఇంతకీ వైల్డ్ సెలబ్రేషన్ అవసరమా?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేకమైన సెలబ్రేషన్ వెనుక కారణం కూడా ఉంది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్ ఓ మొసలితో ఫైట్ చేసే కీలక సన్నివేశం ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో ఈ సీన్‌ను చూపించడంతో అది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అదే కాన్సెప్ట్‌ను అభిమానులు తమ సెలబ్రేషన్లలో ప్రతిబింబించారు.
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్–ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, బొమన్ ఇరానీ, జరీనా వాహబ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ప్రీమియర్ షోల స్పందన, అభిమానుల సందడిని చూస్తుంటే ‘ది రాజాసాబ్’ మొదటి రోజే భారీ వసూళ్ల దిశగా దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలతో పాటు ప్రభాస్ అభిమానుల క్రేజ్ మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Orey Mental Rebels….#TheRajaSaab
pic.twitter.com/9QVM9Z8odH
— cinee worldd (@Cinee_Worldd) January 8, 2026
