Preity Zinta | బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ప్రీతిజింతా మరోసారి ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ జట్టు సహ యజమానిగా కూడా పేరుగాంచిన ఆమె, ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన పలీ హిల్‌లో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.18.50 కోట్లకు విక్రయించినట్లు రిజిస్ట్రేషన్ పత్రాలు వెల్లడించాయి. గత నాలుగు నెలల కాలంలో ప్రీతి జింటా అపార్ట్‌మెంట్ విక్రయించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గతేడాది నవంబర్‌లో కూడా అదే ‘రుస్తోమ్‌జీ పరిశ్రమ్’ భవనంలోని 11వ అంతస్తులో ఉన్న 1,474 చదరపు అడుగుల ఫ్లాట్‌ను ఆమె రూ.14 కోట్లకు పైగా ధరకు అమ్మేశారు.
మార్చి 2, 2026న రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ల ప్రకారం అదే భవనం, అదే అంతస్తులో ఉన్న మరో 1,770 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను ప్రీతి జింటా తాజాగా విక్రయించారు. ఈ ప్రాపర్టీని భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరులు ప్రియా నగర్, రాజీవ్ నగర్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లావాదేవీకి సుమారు రూ.1.11 కోట్ల స్టాంప్ డ్యూటీతో పాటు రూ.30,000 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించినట్లు తెలుస్తోంది. ప్రీతి జింటా వరుసగా తన ఆస్తులను విక్రయించడం వెనుక ఒక పెద్ద ప్లాన్ ఉన్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ముంబైలోనే దాదాపు రూ.100 కోట్ల విలువైన భారీ ప్రాపర్టీని కొనుగోలు చేయాలని ఆమె యోచిస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల విక్రయించిన ఆస్తుల ద్వారా వచ్చిన మొత్తాన్ని కొత్త ప్రాపర్టీలో పెట్టుబడిగా పెట్టే అవకాశముందని చెబుతున్నారు.
ఈ అపార్ట్‌మెంట్‌ను 2023లో జరిగిన రీడెవలప్‌మెంట్ ఒప్పందంలో భాగంగా బిల్డర్ కీస్టోన్ రియల్టర్స్ (రుస్తోమ్‌జీ గ్రూప్) ప్రీతి జింటాకు కేటాయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 23, 2023న కుదిరిన ఒప్పందం ప్రకారం పాత భవనం పునర్నిర్మాణం తర్వాత ఆమెకు ఈ ఫ్లాట్ లభించింది. అయితే ఈ వ్యవహారంపై ప్రీతి జింటా నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. ఇటీవల కాలంలో బాలీవుడ్ ప్రముఖులు భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా అమితాబ్, అక్షయ్ వంటి స్టార్ హీరోలు కూడా కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీల కొనుగోలు, విక్రయాలతో వార్తల్లో నిలిచారు. అలాగే జితేంద్ర, ఏక్తా కపూర్ కూడా ఇటీవల ముంబైలోని తమ అపార్ట్‌మెంట్‌ను రూ.12.25 కోట్లకు విక్రయించినట్లు సమాచారం.
