హర్యానా సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ రివాల్వర్ తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటనలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు పూరన్ తన మరణానికి కారణమైన పోలీస్ శాఖలో పనిచేస్తున్న వ్యక్తుల పేర్లు రాశారు. వారిలో ఒకరైన రోహత్‌క్ సైబర్ సెల్ ఏఎస్‌ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సందీప్ కుమార్ సైతం ‘సత్యం’ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తున్నట్లు లేఖ రాయడం కలకలం రేపుతోంది. మరణించిన ASI నుండి మూడు పేజీల సూసైడ్ నోట్, వీడియో సందేశం స్వాధీనం చేసుకున్నారు. అందులో అతను.. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డ IPS అధికారి వై. పురాన్ కుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశాడు.
ASI తన సూసైడ్ నోట్‌లో… ఐపీఎస్ అధికారి వై. పురాణ్ కుమార్ అత్యంత అవినీతికి పాల్పడ్డాడని, అతని అక్రమాలపై తగినన్ని ఆధారాలు ఉన్నాయని తన సూసైడ్ నోట్ లో ఎఎస్ఐ రాశారు. కుల వివక్షను ఉపయోగించుకుని పురాణ్ కుమార్ మొత్తం వ్యవస్థను హైజాక్ చేశాడని, నిజాయితీపరులైన అధికారులను ఎంతో మందిని వేధించాడని ఆయన ఆరోపించారు. నిజం బయటపడేలా ఈ అవినీతిపై దర్యాప్తు కోరుతూ తాను తన ప్రాణాలను త్యాగం చేస్తున్నట్లు ASI తన సూసైడ్ నోట్ లో రాశారు.
కాగా, ASI సందీప్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలోని సైబర్ సెల్‌లో పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం సందీప్ మృతదేహం ఒక ఇంట్లో ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. మృతుడు తెల్ల చొక్కా, నీలిరంగు జీన్స్ ధరించి ఉన్నాడు. అతని సర్వీస్ రివాల్వర్ మంచం దగ్గర పడి ఉంది. DSP గులాబ్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు కోసం FSL నిపుణుడు డాక్టర్ సరోజ్ దహియాను పిలిపించారు. ఈ ఘటన తర్వాత, పోలీసులు మూడు పేజీల సూసైడ్ నోట్, దివంగత IPS అధికారి వై. పూరన్ కుమార్‌పై సందీప్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన వీడియో సందేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.
హరియాణా డీజీపీని సెలవుపై పంపిన ప్రభుత్వం
హరియాణాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ శత్రుజీత్ కపూర్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయన్ను సెలవుపై పంపించింది. ఈ కేసుకు సంబంధించి ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజర్నియాను ఉన్నతాధికారులు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే డీజీపీని సెలవుపై పంపించామని హరియాణా ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ పేర్కొన్నారు. పూరన్ ఆత్మహత్యకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో డీజీపీ శత్రుజీత్, రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర పేర్లను చేర్చాలంటూ ఆయన భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ కుమార్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
52 ఏళ్ల పూరన్ కుమార్ స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల చండీగఢ్‌లోని తన నివాసంలో ఆయన రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుల వివక్ష, వేధింపులు, అవమానాలతోనే బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆయన సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నారు. ఇందులో ఎనిమిది మంది అధికారుల పేర్లను చేర్చారు. వారిపై చర్యలు తీసుకుంటేనే.. పూరన్ కుమార్ మృతదేహానికి పరీక్షలు, అంత్యక్రియలకు అనుమతిస్తామని కుటుంబసభ్యులు పట్టుబట్టారు. దీంతో గత వారం రోజులుగా దీనిపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఇక, ఈ కేసు దర్యాప్తునకు చండీగఢ్ పోలీసులు ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశారు. న్యాయంగా, పారదర్శకంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని సిట్ అధికారులు తెలిపారు. ఆత్మహత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు వెల్లడించారు.
ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు కారకులపై వెంటనే చర్యలు తీసుకోవాలి – రాహుల్
హరియాణాలోని సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన పూరన్ కుమార్ కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా పూరన్‌కు నివాళులర్పించిన ఆయన.. బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు. అనంతరం రాహుల్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాధికారిపై ఇలాంటి వివక్ష చోటుచేసుకోవడం విషాదకరమన్నారు. ఈ కేసుకు సంబంధించి స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విచారణ జరుపుతామని స్వయంగా హరియాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ హామీ ఇచ్చారన్నారు. కానీ, రోజులు గడుస్తున్నా.. అది నెరవేరటం లేదని విమర్శించారు. తండ్రిని పోగొట్టుకున్న పూరన్‌కుమార్ ఇద్దరు పిల్లలు చాలా ఒత్తిడిలో ఉన్నారన్నారు.
పూరన్ కుమార్ కెరీర్‌ను, ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇతర అధికారులు సంవత్సరాలుగా వివక్ష కొనసాగించారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఇది కేవలం ఒక దళిత కుటుంబానికి సంబంధించినది కాదని, దేశంలోని కోట్లాది మంది దళితులకు సంబంధించినదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారిపై జరిగిన వివక్ష దళితులుగా ఎంత విజయం సాధించినా.. అణచివేత తప్పదనే తప్పుడు సందేశం వారికి వెళ్లేలా చేస్తుందన్నారు. పూరన్ కుమార్ ఆత్మహత్యకు కారకులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ, సీఎంలను డిమాండ్ చేశారు. బాధిత కుటుంబంపై ఉన్న ఒత్తిడిని తొలగించాలన్నారు.
The post Puran Kumar Case: ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
