టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్‌కు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా నుంచి బెదిరింపులు వచ్చాయి. రింకూను దావూద్ ఇబ్రహీం డి-కంపెనీ రూ.10 కోట్లు డిమాండ్ చేసింది. ఈ విషయాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించినట్లు ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది. రింకూను బెదిరించిన నిందితులను పోలీసులు విచారించగా.. ఈ విషయం బయటపడింది. మొహమ్మద్ దిల్షాద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు.
2025 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య రింకూ సింగ్ ప్రమోషనల్ టీమ్‌కు మూడు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యులు రింకూ ఈవెంట్ మేనేజర్‌కు బెదిరింపు ఈమెయిల్స్ పంపి.. రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి మొహమ్మద్ దిల్షద్, మొహమ్మద్ నవీద్ అనే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై పోలీసులు బీహార్‌లోని దర్భాంగా నివాసి అయిన 33 ఏళ్ల మహ్మద్ దిల్షాద్ నౌషాద్‌ను ట్రినిడాడ్ అండ్ టొబాగో నుండి రప్పించారు. అన్ని కేసుల్లోనూ నిందితుడు డి-కంపెనీ సభ్యుడినని చెప్పుకుంటూ.. డబ్బు చెల్లించకపోతే బాధితుడిని చంపేస్తానని బెదిరించాడు. విచారణలో ఈ విషయాన్ని అతడు ఒప్పుకున్నారు.
Also Read: Virender Sehwag Wife: షాకింగ్.. బీసీసీఐ అధ్యక్షుడితో సెహ్వాగ్ సతీమణి డేటింగ్?
ఏప్రిల్ 2025లో జీషన్ సిద్ధిఖీ తనకు ఇమెయిల్ ద్వారా హత్య బెదిరింపులు వచ్చాయని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. డబ్బు చెల్లించకపోతే తన తండ్రి బాబా సిద్ధిఖీకి (ఎన్‌సీపీ నేత) ఎదురైన గతే తనకు పడుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు . ఏప్రిల్ 19, 21 మధ్య బెదిరింపు ఈమెయిల్‌లు వచ్చాయని పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ ఈమెయిల్‌లలో నిందితులు డి-కంపెనీ పేరును ఉపయోగించడమే కాకుండా.. దర్యాప్తును తప్పుదారి పట్టించడానికి కూడా ప్రయత్నించారు. ఈ విషయాన్ని కూడా నిందితులు ఒప్పుకున్నారు.
