Bus Accidents: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు (Travels Bus) ప్రమాదాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. గత వారం కర్నూలు జిల్లాలో వేమురి కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మంగళవారం తెల్లవారుజామున మూడు ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురయ్యాయి. నల్లగొండ (Nalgonda) జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపుతప్పి ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ (Tractor) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కావలి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లి మండలం దామరాజు పల్లి దగ్గర జబ్బార్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన ఓ మహిళ మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. ఈ బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తోంది. మృతురాలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. మరోవైపు.. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్‌లో భారతి ట్రావెల్స్‌కి చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పది మందికి గాయాలయ్యాయి. ఆయా ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
