Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Sankranthi Movies | ఈ సంక్రాంతికీ అదే రిపీట్.. దశబ్దాల ఫార్ములాతో హిట్ కొట్టిన సినిమాలు!

Ai generated article, credit to orginal website, January 18, 2026

Sankranthi Movies | సెంటిమెంట్‌ పండినా.. యాక్షన్‌ ఇరగదీసినా..క్రైమ్‌ అండ్‌ పనిష్మెంట్‌ మెప్పించినా.. అడ్వెంచర్‌ అబ్బురపరిచినా..సినిమా విజయవంతం అవుతుందన్న గ్యారెంటీ లేదు!వీటన్నిటినీ మించి.. సినిమాను విజయతీరాలకు చేర్చే ఊతం మాత్రం కామెడీనే!ఏ జానర్‌ కథ అయినా.. కామెడీని పర్‌ఫెక్ట్‌గా పండించగలిగితే.. చిత్రానికి తిరుగులేదని ప్రేక్షకుడు ఎన్నోసార్లు నిరూపించాడు. అలాగనికామెడీ సినిమాలన్నీ సిల్వర్‌జూబ్లీ ఆడాయని కాదు. కానీ, హాస్య ప్రధాన చిత్రాలు.. ప్రేక్షకులకు కనెక్ట్‌ అయితే, తిరుగుండదని టాక్‌. అందుకే దశాబ్దాలుగా హాస్యాన్ని నమ్ముకొనే… సినిమా సక్సెస్‌ రేట్‌ పెంచుకుంటున్నది టాలీవుడ్‌. ఈ సంక్రాంతి రేసు కూడా ఇదే విషయాన్ని నిరూపించింది.
సగటు ప్రేక్షకుడు సినిమాకు ఎందుకు వెళ్తాడు? ఓ రెండున్నర గంటలు తన చికాకులన్నీ మర్చిపోవడానికే! మనసారా నవ్వుకోవడానికి! తృప్తిగా సేదతీరడానికి! యాక్షన్‌, సస్పెన్స్‌, అడ్వెంచర్‌ తరహా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులు ఉంటారు. సెంటిమెంట్‌ సినిమాకే మా ఓటు అనేవాళ్లూ ఉంటారు. కానీ, ఈ అందరూ ఇష్టపడేది హాస్యప్రధాన సినిమాలే! అందుకే, విజయవారి ‘మిస్సమ్మ’ మొదలుకొని నిన్నటి ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ వరకు హాస్యం రంగరించిన కథలు హిట్టు కొట్టడంతోపాటు, ప్రేక్షకులకూ అలా గుర్తుండిపోయాయి.
‘పాతాళభైరవి’ పక్కా జానపద చిత్రం. ఎవర్‌గ్రీన్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సినిమా కూడా! హాస్యాన్ని పక్కకు పెట్టి.. ఈ సినిమాను ఊహించుకోండి! రేలంగి పాత్ర సీరియస్‌గా ఉండి ఉంటే, తోటరాముడు అసిస్టెంట్‌ అంజి (బాలయ్య) పాత్ర లేకపోతే.. ఎంత చప్పగా ఉండేది! అంతెందుకు, నేపాళ మాంత్రికుడిగా ఎస్వీయార్‌, తోటరాముడిగా ఎన్టీయార్‌ కామెడీ టైమింగ్‌ కుదరకపోయి ఉంటే.. ‘పాతాళభైరవి’ వెండితెర చిత్రరాజంగా నిలిచిపోయేదా? మన ‘మిస్సమ్మ’నే చూసుకోండి, ‘అప్పుచేసి పప్పు కూడు’ ఆ మాటకొస్తే.. ‘గుండమ్మకథ’.. ఇవన్నీ పక్కా ఫ్యామిలీ సబ్జెక్టులు, సెంటిమెంట్‌ సినిమాలు! ఆయా చిత్రాల్లో కామెడీ సెపరేట్‌ ట్రాక్‌లా కాకుండా.. కథానుగుణంగానే సాగిపోయింది. ఆనాటి కథకులు హాస్యరసాన్ని జోడించి ఉండకపోయి ఉంటే… ఈ సినిమాలు ఏమయ్యేవో! ప్రేక్షకులు ఎంత నష్టపోయేవారో?!
సీరియస్‌ కథల్లో.. హాస్యాన్ని ఇమడ్చలేక, ప్రధాన కథకు సమాంతరంగా కామెడీ ట్రాక్‌ను నడిపించి.. గెలిచిన ఉదంతాలూ ఉన్నాయి. బ్లాక్‌ అండ్‌ వైట్‌ రోజుల నుంచీ ఈ ట్రెండ్‌ కొనసాగింది. రేలంగి-రమణారెడ్డి, రేలంగి-పద్మనాభం, రేలంగి-గిరిజ, పద్మనాభం-గీతాంజలి.. ఇలా ప్రతి సినిమాలో ఈ తరహా పెయిర్‌తో హాస్యాన్ని పండించి, సినిమాను బతికించుకునేవాళ్లు. ప్రధాన కథకు అనుబంధంగా కామెడీని నడిపించే ఫార్ములాను తోసిరాజని.. కామెడీ సెంట్రిక్‌గా సినిమాలు తీయడంలోనూ మనవాళ్లు సిద్ధహస్తులు అనిపించుకున్నారు.
1960 దశకం తర్వాత లూప్‌లైన్‌లో సాగిపోయిన కామెడీని.. మెయిన్‌ ట్రాక్‌ ఎక్కించిన ఘనత మాత్రం దర్శకుడు జంధ్యాలకే దక్కుతుంది. నవ్వించడం యోగం అంటూ.. ఆయన పనిగట్టుకొని మరీ సినీకళామతల్లికి తన సినిమాలతో చెక్కిలిగింతలు పెట్టారు. వేటగాడు లాంటి కమర్సియల్‌ సినిమాలకు, శంకరాభరణం లాంటి క్లాసిక్‌ చిత్రాలకు మాటలు రాసి మెప్పించిన జంధ్యాల తన వరకు వచ్చేసరికి.. హాస్యాన్ని అందలం ఎక్కించేశారు. ‘ముద్దమందారం’లా విరిసిన ఆయన తొలి నవ్వులు.. ‘మల్లెపందిరి’ కింద ‘నాలుగుస్తంభాలాట’ ఆడుకొని అందరినీ ముసిముసిగా నవ్వించాయి. ‘శ్రీవారికి ప్రేమలేఖ’ మొదలుకొని… ఆయన చివరి చిత్రం వరకూ.. ఆరోగ్యకరమైన హాస్యం పెంచుతూ, అందరికీ పంచుతూ వచ్చారు జంధ్యాల. ఈ చిత్రాల్లో సింహభాగం ప్రేక్షకులకు నవ్వులు, నిర్మాతలకు కాసులు పంచాయి. జంధ్యాల జోరుమీద ఉన్నప్పుడే దర్శకుడు రేలంగి నరిసింహారావు గేరు మార్చి దూసుకొచ్చారు. ఆయన కెరీర్‌లో 75కుపైగా సినిమాలకు దర్శకత్వం వహిస్తే.. అందులో 70 సినిమాల వరకూ హాస్య ప్రధానమైనవే కావడం విశేషం. సెంటిమెంట్‌కు కేరాఫ్‌గా నిలిచిన దాసరి కాంపౌండ్‌ నుంచి వచ్చిన రేలంగి… తన గురువుగారికి పూర్తి భిన్నంగా కామెడీసాగు చేసి.. తెలుగు సినిమాలో నవ్వుల షేర్‌ పెంచారు. తెలుగు సినిమాల్లో మళ్లీ హాస్యం సైడ్‌ ట్రాక్‌ అయిపోతున్న రోజుల్లో మళ్లీ ఇద్దరొచ్చారు. వాళ్లే ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి. కామెడీ డోస్‌ పెంచి ఈవీవీ నవ్వుల బాంబులు పేల్చితే, జంధ్యాల బాటలో ఆరోగ్యకరమైన హాస్యంతో నవ్వుల మతాబులు వెలిగించారు ఎస్వీ కృష్ణారెడ్డి.
తర్వాత వచ్చిన చాలామంది దర్శకులు కామెడీకి పెద్దపీట వేయకున్నా… జంపుకానా అయినా పరిచారు. దర్శకుడు విజయ భాస్కర్‌ నుంచి త్రివిక్రమ్‌ వరకు.. కథ ఏదైనా కామెడీని అంతర్లీనంగా జోడించి అదుర్స్‌ అనిపించుకున్నారు. వివి వినాయక్‌ నుంచి హరీశ్‌ శంకర్‌ వరకు సీరియస్‌ సబ్జెక్టులోనూ హాస్యానికి తగు చోటిచ్చి.. ప్రేక్షకుల దగ్గర మాట దక్కించుకున్నారు. కామెడీకి మళ్లీ ఊపు తెచ్చిన దర్శకుడు శ్రీను వైట్ల అని చెప్పొచ్చు. అయితే, కొన్నాళ్లకు కథే కామెడీగా మారిపోవడంతో ఆ సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర తేలిపోయాయి. ఇలా చెబుతూపోతే ఒకరా, ఇద్దరా… అప్పుడున్న పాత దర్శకులు, ఇప్పుడొస్తున్న యంగ్‌ డైరెక్టర్లు అందరికీ తెలుసు.. కామెడీని మనం పోషిస్తే, అది మన సినిమాని రక్షిస్తుందని! ఇదే సూత్రంపై వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ దగ్గర పండుగ చేసుకుంటున్నాయి.
పర్‌ఫెక్ట్‌ కామెడీ ఉంటే సినిమా సూపర్‌ హిట్‌ అని ఈ సంక్రాంతి మరోసారి నిరూపించింది. ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కామెడీ జానర్‌వే కావడం విశేషం. ఇందులో కామెడీ హారర్‌గా తెరకెక్కిన ‘ది రాజాసాబ్‌’ మినహాయిస్తే.. మిగతా సినిమాలన్నీ మంచి వసూళ్లనే రాబడుతున్నాయి. టైమింగ్‌లో టాలీవుడ్‌ కింగ్‌ అనిపించుకున్న మెగాస్టార్‌ వింటేజ్‌ కామెడీతో అదరగొట్టాడు. హాస్యరసాన్ని ఆపోసన పట్టిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి మునుపటి పటిమను కనబర్చాడని మెగా ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి విషయానికి వస్తే.. కామెడీ తనకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా హాస్యపు జల్లులు కురిపిస్తున్నాడు. దాదాపు ప్రతి సంక్రాంతికీ సంతోషాల సంతకం చేసేస్తున్నాడు. తొలి చిత్రం ‘పటాస్‌’లో చిరు హాస్యం పండించిన ఆయన బాలకృష్ణతో వచ్చిన ‘భగవత్‌ కేసరి’ మినహా మిగతా అన్ని చిత్రాల్లోనూ నవ్వుల పువ్వులు పూయించాడు. ‘సరిలేరు నీకెవ్వరు’లాంటి హై కమర్షియల్‌ మూవీలోనూ కామెడీ డోస్‌ తగ్గకుండా చూసుకున్నాడు. ఫ్యామిలీ హీరో వెంకటేశ్‌తో ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇలా హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టాడు. ‘మన శంకరవరప్రసాద్‌ గారు’తో ముచ్చటగా మూడో హ్యాట్రిక్‌ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొని.. కామెడీని నమ్ముకోండి అని ఇండస్ట్రీకి చాటి చెప్పాడు అనిల్‌ రావిపూడి.
ఈ సంక్రాంతికే వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’ థియేటర్లలో నవ్వులు పండిస్తున్నది. శ్రీవిష్ణు కథానాయకుడిగా వచ్చిన ‘సామజవరగమన’ సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన దర్శకుడు రామ్‌ అబ్బరాజు.. మరోసారి కామెడీనే నమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు. ‘జాతి రత్నాలు’తో అదుర్స్‌ అనిపించుకున్న హీరో నవీన్‌ పోలిశెట్టిని సంక్రాంతి రేసులో నిలబెట్టింది కూడా కామెడీనే! ఆయన హీరోగా, మారి దర్శకత్వంలో వచ్చిన ‘అనగనగా ఒక రాజు’ కూడా నవ్వులు పంచుతూ, వసూళ్లు రాబడుతున్నది. మాస్‌ మహారాజా రవితేజ కామెడీ టైమింగ్‌ మనకు తెలియంది కాదు. పర్‌ఫెక్ట్‌ డైరెక్టర్‌ పడితే.. రవితేజ నవ్వుల తేజం అయిపోతాడు. ఆయన హీరోగా వచ్చిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లోనూ కామెడీ చక్కగానే పండింది. సెంటిమెంట్‌ పాళ్లు ఎక్కువే ఉన్నా.. కామెడీకి లోటు లేకపోవడంతో, సంక్రాంతి రేసులో నవ్వుల భోగాలు అందించింది. ఏతావాతా తేలిందేమింటంటే… సినిమాకు బలం కథ. ఆ కథలో కామెడీ ఉంటే మరింత బలం. అది పండితే.. ప్రేక్షకులకు పండుగ, దర్శకనిర్మాతలకు పండుగ, వెరసి సినిమా ఇండస్ట్రీకి పెద్ద పండుగ.

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • మ‌హేష్ బాబు ‘వార‌ణాసి’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
  • ద‌ర్శ‌కుడు మారుతికి ‘డార్లింగ్’ ఫుల్ స‌పోర్ట్
  • రుతు ఆరోగ్యం బాలిక‌ల ప్రాథ‌మిక హ‌క్కు : సుప్రీంకోర్టు
  • వివేకానంద మానవ వికాస కేంద్రం ప్రారంభానికి సిద్దం
  • కేసీఆర్ తో పెట్టుకోవ‌డం అంటే పులిని గోక్క‌వ‌డ‌మే

Recent Comments

No comments to show.

Archives

  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes