ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో దక్షిణాఫ్రికా ఊహించని విజయాలు అందుకుంటోంది. భారత్‌తో మ్యాచ్‌లో ఓటమి తప్పదనుకున్న స్థితిలో గొప్పగా పోరాడిన దక్షిణాఫ్రికా.. బంగ్లాదేశ్‌పై కూడా అలాగే ఆడి గెలిచింది. 233 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి అంచన నిలిచిన ప్రొటీస్.. చివరికి 3 వికెట్ల తేడాతో గెలిచింది.చోలే ట్రైయాన్ (62), నదైన్ డిక్లెర్క్ (37) మరోసారి మెరవడంతో దక్షిణాఫ్రికా అనూహ్య విజయాన్ని అందుకుంది. ప్రొటీస్ టీమ్ టోర్నీలో హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. పాయింట్స్ టేబుల్‌లో ప్రొటీస్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 6వ స్థానంలో నిలిచి తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. టాప్ 4లో ఉన్న జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయన్న విషయం తెలిసిందే.
విశాఖపట్నం వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. షర్మీన్ అక్తెర్ (50), షోర్నా అక్తెర్ (51)లు అర్ధ శతకాలతో రాణించారు. ఓపెనర్ ఫర్గాన హోక్ (30), కెప్టెన్ నిగర్ సుల్తానా (32), రుబ్యా హైదర్ (25) నెమ్మదిగా ఆడారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లబా రెండు వికెట్లు తీయగా.. నదినే డీ క్లెర్క్, చోలె ట్రయాన్ చెరో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ డకౌట్ అయింది. లారా వోల్వార్డ్ (31), అన్నేకే బోష్ (28)లు ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపారు. బంగ్లా బౌలర్లందరూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ప్రొటీస్ కష్టాల్లో పడింది. లారా, అన్నేకేతో పాటు అన్నేరీ డెర్క్సెన్ (2), సినాలో జాఫ్తా (4)లు పెవిలియన్ చేరారు. బంగ్లా విజయం ఖాయం అనుకున్న సమయంలో ప్రొటీస్ బ్యాటర్లు చెలరేగారు. మరిజన్నే కాప్ (56) హాఫ్ సెంచరీ చేయగా.. ట్రైయాన్, డిక్లెర్క్ పోరాడారు. చివరి ఓవర్‌లో 8 పరుగులు అసవరం అవ్వగా.. డిక్లెర్క్ సిక్సర్ బాది అద్భుత విజయాన్ని అందించింది.
