Shamshabad Airport | హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 14 కిలోల హైడ్రోఫోనిక్ ( మట్టి లేకుండా సాగు చేసే ) గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.
శుక్రవారం ఉదయం ఖతర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. వారి వద్ద హైడ్రోఫోనిక్ గంజాయి దొరికింది. దీని విలువ రూ.14 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయితో పట్టుబడిన ఇద్దరు ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఇటీవల కాలంలో విదేశాల్లో సాగు చేస్తున్న హైడ్రోఫోనిక్ గంజాయిని ఇండియా తరలించడం పెరిగింది. ఈ తరహాలో విదేశాల నుంచి గంజాయిని తీసుకొస్తున్న వారిపై డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ) అధికారులు నిఘా పెంచారు. అయినప్పటికీ గంజాయి అక్రమ రవాణా ఆగట్లేదు. రెండు రోజుల క్రితం కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో కిలో హైడ్రోఫోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో పట్టుబడుతామన్న భయంతో ప్రయాణికులు సీటులోనే ఆ గంజాయిని వదిలివెళ్లారు.
