ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డిజిటల్ రంగంలోకి మరో వినూత్న ప్రయత్నంతో ముందుకు వస్తోంది. హీరోయిన్ శోభిత ధూళిపాలను ప్రధాన పాత్రలో పెట్టి ఓ సరికొత్త వెబ్ మూవీని నిర్మించింది. ఈ చిత్రానికి యువ దర్శకుడు శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి ‘చీకట్లో’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ వెబ్ సినిమాని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేయనున్నారు. అయితే, ఈ విడుదలలో ఓ ప్రత్యేకత ఉంది. ‘చీకట్లో’ చిత్రాన్ని ఏకంగా 18 భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయబోతున్నారు.
Also Read : Tejashwi Yadav: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా.. తేజస్వి యాదవ్ సంచలన ప్రకటన
ఓటీటీలో ఒక సినిమా ఇన్ని భాషల్లో డబ్ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు ఈ సినిమాను చేరువ చేయాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. థ్రిల్లర్ జానర్‌లో రానున్న ఈ వెబ్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. శోభిత నటన, శరత్ కొప్పిశెట్టి టేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ సినిమాని నవంబర్‌లో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అధికారిక విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.
