శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించే విషయం తనకు కాస్త ముందుగానే తెలుసు అని మీడియా సమావేశంలో శుభ్‌మన్ గిల్ చెప్పాడు. ‘అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ తర్వాత ఆస్ట్రేలియా సిరీస్ కోసం జట్టును ప్రకటించారు. అంతకుముందే నాకు కెప్టెన్సీ విషయం తెలుసు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉండటం ఎప్పుడూ గౌరవమే. కెప్టెన్‌గా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తా. మైదానంలో రోహిత్ శర్మ చాలా ప్రశాంతంగా ఉంటాడు. కెప్టెన్‌గా జట్టులో నెలకొల్పిన స్నేహపూరిత వాతావరణాన్ని నేనూ కొనసాగిస్తా. ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించాలనే లక్ష్యంతోనే ముందుకు సాగుతాం. వచ్చే కొన్ని నెలలు చాలా ముఖ్యం’ అని గిల్ చెప్పాడు.
Also Read: Rashid Khan: రషీద్ ఖాన్ అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఏ బౌలర్‌కు సాధ్యం కాలేదు!
‘బయటి వ్యక్తులు రకరకాల మాటలు అంటుంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. వారిద్దరి భవితవ్యంపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నాయి. వారిద్దరూ భారత జట్టును ఎన్నో మ్యాచులలో గెలిపించారు. ఇద్దరూ అద్భుతమైన నైపుణ్యం గల క్రికెటర్లు. జట్టుకు వారి అవసరం చాలా ఉంది. 2027 వన్డే ప్రపంచకప్ లక్ష్యంగా సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం’ అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.
