Supreme court: ‘‘ఉరితీయడం’’ ద్వారా మరణశిక్ష విధించడంపై సుప్రీంకోర్టులో ఆసక్తికర చర్చ జరిగింది. ఉరికి బదులుగా, ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరణశిక్ష విధించడానికి కేంద్రం ఇష్టం చూపడం లేదని సుప్రీంకోర్టు బుధవారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం, ఉరికి బదులుగా వేరే విధంగా మరణశిక్ష విధించేందుకు సిద్ధంగా లేదు అని చెప్పింది. మరణశిక్షలకు ఉరితీయడానికి బదులుగా ప్రాణాంతక ఇంజెక్షన్లు, కరెంట్ షాక్, గ్యాస్ చాంబర్ వంటి తక్కువ బాధాకరమైన ప్రత్యామ్నాయాలను అనుమతించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
ఉరిశిక్ష ద్వారా ప్రాణాలు తీయడం చాలా బాధకరమైందని, అమానవీయమైందని, క్రూరమైందని న్యాయవాది రిషి మల్హోత్రా పిటిషన్ దాఖలు చేశారు. మరణశిక్ష విధించబడిన వ్యక్తికి ‘‘చనిపోయే వరకు మెడకు ఉరితీయడం ద్వారా’’ శిక్షను ఆదేశించి నిబంధన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC)లోని సెక్షన్ 354(5)ని కూడా ఈ పిటిషన్ సవాలు చేస్తుంది. ఈ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ఆధునిక మానవీయ ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని పిటిషన్ పేర్కొంది.
Read Also: Mahesh Kumar Goud: ఏ పార్టీ అధికారంలో ఉన్న తెలుగు వారంతా కలిసే ఉండాలి.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం మాదే..
అయితే, కేంద్రం ఈ ఆలోచనను వ్యతిరేకించింది. ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది సోనియా మథూర్ మాట్లాడుతూ.. ఇలాంటి ఎంపికలు ఆచరణాత్మకంగా సాధ్యం కాదు అని, ఉరిశిక్షను మార్చడం అనేది విధానపరమైన నిర్ణయం అని, దీనిని ప్రభుత్వాలు నిర్ణయించాల్సి ఉంటుందని, కోర్టులు కాదు అని అన్నారు.
కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు మారేందుకు సిద్ధంగా లేవని, ఇది చాలా పాత పద్ధతి అని, కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయని జస్టిస్ మెహతా వ్యాఖ్యానించారు. ప్రభుత్వం గతంలో ఉరి శిక్షను సమర్థించింది. అయితే, పిటిషనర్ ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారా మరింత వేగంగా శిక్ష అమలు చేయవచ్చని, మరింత మానవీయంగా ఉంటుందని, అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 49 రాష్ట్రాలు దీనిని స్వీకరించాయని పేర్కొన్నారు.
ఉరిశిక్ష అమలు పద్ధతులను సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం పరిశీలిస్తోందని కోర్టు గతంలో గుర్తించింది. బుధవారం, ఆ కమిటీ స్థితిపై కొత్త సూచనలను కోరుతామని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్‌పై నవంబర్ 11న మళ్లీ విచారణ చేయనునంది. మరణశిక్ష ఇప్పటికీ అమలులో ఉన్న దేశాల్లో సాధ్యమైనంత తక్కువ బాధాకరమైన రీతిలో శిక్షను అమలు చేయాలని కోరుతూ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని కూడా పిటిషనర్ మల్హోత్రా పిటిషన్‌లో ఉదహరించారు.
