భారత క్రికెట్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్‌లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం.
విరాట్ కోహ్లీ:
భారత టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్సీ విషయానికి వస్తే కింగ్ ‘విరాట్ కోహ్లీ’ పేరు ఎప్పుడూ ముందుంటుంది. 2014 నుంచి 2022 వరకు 68 టెస్ట్ మ్యాచ్‌లలో విరాట్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 40 టెస్ట్ మ్యాచ్‌లలో విజయాలు అందించాడు. కోహ్లీ టెస్ట్ విజయ శాతం 58.82 శాతంగా ఉంది. ఈ విజయ శాతం ఏ భారత కెప్టెన్‌కైనా అత్యుత్తమం. కోహ్లీ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. ఇంగ్లాండ్‌లో సిరీస్ ఆధిక్యం కూడా ఉంది. కోహ్లీ జట్టుకు దూకుడు, జట్టులో ఫిట్‌నెస్ సంస్కృతిని తెచ్చాడు.
ఎంఎస్ ధోనీ:
మహేంద్ర సింగ్ ధోనీ 60 టెస్ట్ మ్యాచ్‌ల్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. మహీ కెప్టెన్సీలో భారత్ 27 టెస్ట్ మ్యాచ్‌లలో గెలిచింది. ధోనీ విజయ శాతం 45. ధోని టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న కాలంలో భారతదేశం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని సాధించింది. మహీ కెప్టెన్సీలో యువ ఆటగాళ్లకు అవకాశాలు లభించాయి. ధోనీ కెప్టెన్సీలో భారతదేశం విదేశాలలో చాలా మ్యాచ్‌లను గెలవకపోవచ్చు కానీ.. స్వదేశంలో సత్తాచాటింది.
సౌరవ్ గంగూలీ:
సౌరవ్ గంగూలీ భారత జట్టుకు విదేశీ ఆటగాళ్లను ధీటుగా ఎదుర్కోవడం నేర్పించాడు. కోల్‌కతా యువరాజుగా పిలువబడే గంగూలీ 2000 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా 49 టెస్టులు ఆడి 21 గెలిచింది. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఎంఎస్ ధోనీ వంటి యువ ఆటగాళ్లకు జట్టులో అవకాశాలు ఇచ్చాడు. సెహ్వాగ్, జహీర్ వంటి ఆటగాళ్లలో గంగూలీ ఆత్మవిశ్వాసాన్ని నింపాడు.
Also Read: IND vs WI: కరేబియన్ క్రికెట్ క్యాన్సర్‌తో బాధపడుతోంది.. డారెన్ సామీ సంచలన వ్యాఖ్యలు!
మహమ్మద్ అజారుద్దీన్:
1990-1999 మధ్య మహమ్మద్ అజారుద్దీన్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అజారుద్దీన్ కెప్టెన్సీలో భారతదేశం 47 టెస్టులు ఆడి 14 విజయాలు సాధించింది. అజరుద్దీన్ కెప్టెన్సీలో భారతదేశం విదేశాలలో కాకపోయినా.. స్వదేశంలో అసాధారణ ప్రదర్శన ఇచ్చింది.
సునీల్ గవాస్కర్:
సునీల్ గవాస్కర్ 47 టెస్ట్ మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. 1976 నుండి 1995లో లిటిల్ మాస్టర్ టెస్టులకు నాయకత్వం వహించాడు. భారత్ తొమ్మిది టెస్టుల్లో గెలిచి.. 30 డ్రా చేసుకుంది. టెస్ట్ క్రికెట్‌లో 10,000 పరుగుల మార్కును చేరుకున్న తొలి ఆటగాడైన గవాస్కర్.. భారతదేశానికి అనేక ఉత్కంఠభరితమైన టెస్ట్ విజయాలను అందించాడు.
