Top 10 | ఓటీటీ వేదికల్లో తెలుగు సినిమాల ప్రభావం రోజురోజుకీ పెరుగుతోంది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video )ఇండియా వైడ్ ట్రెండింగ్ టాప్–10 చిత్రాల జాబితాలో తెలుగు సినిమా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషంగా మారింది. మరి ఆ చిత్రం మరెదో కాదు నారీ నారీ నడుమ మురారి. హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్ సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందింది. పరిమిత థియేటర్లలోనే విడుదలైనప్పటికీ దాదాపు రూ.25 కోట్ల వరకు వసూళ్లు సాధించి తన సత్తా చాటింది. ఇప్పుడు ఓటీటీలో మాత్రం అగ్రస్థానంలో నిలిచి మరింత హల్‌చల్ చేస్తోంది. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా, దర్శకుడు రామ్ అబ్బరాజు రూపొందించారు. ముఖ్యంగా సీనియర్ నటుడు నరేష్ కామెడీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలిచింది.
టాప్–2 స్థానంలో తమిళ స్టార్ హీరో కార్తీ, హీరోయిన్ కృతి శెట్టి జంటగా నటించిన వా వాతియార్ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) నిలిచింది. యాక్షన్–కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి వ్యూయర్‌షిప్ సాధిస్తోంది. మూడో స్థానంలో హాలీవుడ్ యాక్షన్ చిత్రం The Wrecking Crew ట్రెండ్ అవుతోంది. నాలుగో స్థానంలో శోభితా దూళిపాళ నటించిన యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో నిలిచింది. గత నెలలో డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. ప్రారంభంలో మామూలు స్పందన వచ్చినా, ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌లో నిలవడం విశేషం. ఐదో స్థానంలో తమిళ మైథలాజికల్ థ్రిల్లర్ మహాసేనా కొనసాగుతోంది. దర్శకుడు దినేష్ కలైసెల్వన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వేమల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు.
టాప్–6లో నటుడు సూరి నటించిన యాక్షన్ డ్రామా మామన్ చోటు దక్కించుకుంది. ఏడో స్థానంలో బాలీవుడ్ వార్ డ్రామా 120 బహదూర్ నిలవగా, ఇందులో ఫర్హాన్ అక్తర్ సైనికుడి పాత్రలో కనిపించారు. ఎనిమిదో స్థానంలో జగ్నుమాః ది ఫేబుల్, తొమ్మిదో స్థానంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వాధ్, పదో స్థానంలో హర్రర్ క్రైమ్ థ్రిల్లర్ ది స్ట్రేంజర్ నిలిచాయి. మొత్తంగా ఈ జాబితాలో తెలుగు సినిమా అగ్రస్థానంలో నిలవడం టాలీవుడ్‌కు గర్వకారణంగా మారింది.
