ఆమె ఒక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. గౌరవ ప్రదమైన వృత్తిలో ఉంది. పది మందిని సన్మార్గంలో నడిపించాల్సిన పండితులమ్మ బుద్ధిహీనురాలిలా ప్రవర్తించింది. టికెట్ తీసుకుని రైల్లో ప్రయాణించాల్సిన ఆమె.. దర్జాగా ఏసీ కోచ్‌లో కూర్చుని జర్నీ చేస్తోంది. టికెట్ చూపించమన్న పాపానికి టిక్కెట్ కలెక్టర్ వేధిస్తున్నాడంటూ రివర్స్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏసీ కోచ్‌లో మహిళా ఉపాధ్యాయురాలు ప్రయాణం చేస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె తాను బీహార్ ప్రభుత్వ టీచర్‌ను అని చెప్పుకొచ్చింది. అదేమీ పట్టించుకోకుండా మళ్లీ టికెట్ చూపించమని అడిగాడు. దీంతో ఆమె రివర్స్ అయి ‘‘నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నావు.’’ అని ఎదురుదాడికి దిగింది. ఇందుకు సంబంధించిన మాటలు వీడియోలో స్పష్టంగా వినిపించాయి.
వెంటనే టీసీ ప్రతి స్పందనగా ఇది ఇబ్బంది కలిగించే విషయం కాదు.. మీ దగ్గర టికెట్ ఉంటే చూపించండి అని అడిగాడు. మీరు ప్రభుత్వ టీచర్ కదా? గతంలో కూడా ఇదే మాదిరిగా టికెట్ లేకుండా ప్రయాణం చేశారంటూ బదులిచ్చాడు. వెంటనే ఆమె నువ్వు అబద్ధం చెబుతున్నావు అని ఆ మహిళ అంది. దీనికి టీటీఈ.. ‘‘నాకు చాలా స్పష్టంగా గుర్తుంది. నువ్వు బీహార్ ప్రభుత్వంలో టీచర్‌వి. టిక్కెట్లు లేకుండా చాలా సార్లు ప్రయాణం చేస్తున్నావు. కాకపోతే నీ దగ్గర ఏవైనా టిక్కెట్లు ఉంటే మాకు చూపించు.’’ అని అడిగాడు.
ఈ సంభాషణ అంతటిని టీటీఈ తన మొబైల్‌లో రికార్డ్ చేస్తున్నాడు. ఆమె మాత్రం ఫోన్‌లో బిజీగా ఉంది. ఫోన్‌లో రికార్డ్ చేయొద్దంటూ ఆమె టీసీపైకి లేచింది.. వెంటనే అతడు ముట్టుకోవద్దని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆమె ‘‘నేను వెళ్తున్నాను. నువ్వు ఒక స్త్రీని వేధిస్తున్నావు’’ అని అరుస్తూ వెళ్లేపోయే ప్రయత్నం చేసింది. ఇంతలో టీసీ ‘‘నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? నీ దగ్గర టికెట్ లేదు. నేను నిన్ను స్లీపర్ (స్లీపర్ కోచ్) లో వెళ్లమని అడుగుతున్నాను. నువ్వు వెళ్లడం లేదు. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానని నువ్వు చెబుతున్నావు. అదంతా అబద్దం.’’ అని టీసీ వాపోయాడు. ఇంతలో ఆమె ‘‘నేను వెళ్లకపోతే నువ్వు ఏం చేస్తావు? నువ్వు చాలా కాలంగా నన్ను ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు నన్ను రికార్డ్ చేస్తున్నావని నాకు తెలుసు.’’ అని ఆమె అంది. వెంటనే టీటీఈ గట్టిగా సమాధానం చెబుతూ.. ‘‘అవును.. నేను కూడా. నువ్వు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేస్తున్నట్లు చూస్తున్నా. కానీ నువ్వు ఇబ్బంది పడుతున్నానని చెబుతున్నావు.’’ ఇంత వరకు కరెక్ట్ అని టీసీ వ్యాఖ్యానించారు.
చివరికి మహిళ తన బ్యాగును తీసుకొని వెళ్లిపోబోతుండగా టీటీఈతో ‘‘నువ్వు పనికిరాని వ్యక్తివి’’ అని సంబోధించింది. దీనికి టీటీఈ స్పందిస్తూ.. ‘‘నేను పనికిరాని వ్యక్తిని కాదు. నువ్వే. నేను నిన్ను పనికిరాని వ్యక్తి అని పిలుస్తుంటే నీకు బాధగా అనిపిస్తుంది. నువ్వు బీహార్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలి. టిక్కెట్లు లేకుండా ప్రయాణం చేస్తున్నావు.’’ అని టీటీఈ గట్టిగానే వాదించాడు.
ఇది కూడా చదవండి: CJI BR Gavai: అది మరిచిపోయిన అధ్యాయం.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఏ ట్రైన్‌లో.. ఏ ప్రాంతంలో జరిగిందో తెలియదుగానీ.. ఉపాధ్యాయురాలి తీరుపై మాత్రం నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. టికెట్ చూపించమని అడిగినప్పుడు చూపించకుండా ఇదేమీ రాద్ధాంతం అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరు కూడా చూసేయండి.
Victim Genderpic.twitter.com/CbiKB63sd7
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) October 7, 2025
