Trump Tariffs | ఇరాన్‌తో సంక్షోభం వేళ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆ దేశాన్ని టార్గెట్ చేస్తూ భారీగా సుంకాలను విధించేందుకు సిద్ధమయ్యారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే అన్ని దేశాలపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.
ఇరాన్‌తో వాణిజ్యం చేసే ఏ దేశమైనా అమెరికాతో వ్యాపారం చేయాలంటే 25 శాతం టారిఫ్ చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని.. ఇదే తుది నిర్ణయమని తెలిపారు. ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలపై ఇరాన్ ప్రభుత్వం హింసాత్మకంగా వ్యవహరిస్తుందని ట్రంప్ ఆరోపించారు. ఇరాన్ చర్యలతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. ఆ దేశాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచ వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా చైనా, భారత్, యూఏఈ, టర్కీ వంటి దేశాలపై దీని ప్రభావం పడుతుందని అంటున్నారు.
Trump1
మరోవైపు ఇరాన్‌పై సైనిక చర్యలు తీసుకునే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని వైట్‌హౌస్ వెల్లడించింది. గగనతల దాడులు సహా అనేక ఆప్షన్లు తమ ముందున్నాయని వైట్‌హౌస్ ప్రెస్ కార్యదర్శి కారోలిన్ లివిట్ తెలిపారు. దౌత్యమార్గం కూడా పూర్తిగా మూసివేయలేదని.. ట్రంప్ ప్రత్యేక ప్రతినిది స్టీవ్ విట్‌కాఫ్‌తో ఇరాన్ గోప్యంగా సంప్రదింపులు జరుపుతుందని వివరించారు. బహిరంగ ప్రకటనల్లో ఒకలా.. లోపల మరోలా ఇరాన్ వ్యవహరిస్తుందని ఆరోపించారు.
చర్చలకు సిద్ధమే కానీ.. యుద్ధానికి సన్నద్ధం
అమెరికాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధమని, అయితే యుద్ధానికి తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని ఇరాన్ సోమవారం ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ టెహ్రాన్‌లో విదేశీ రాయబారుల సదస్సులో ప్రసంగిస్తూ ఇస్లామిక్ రిపబ్లిక్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కాని యుద్ధానికి సర్వసన్నద్ధంగా ఉందని చెప్పారు.తాము చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నామని, కానీ అవి న్యాయబద్ధంగా, సమాన హక్కులు, పరస్పర గౌరవం ప్రాతిపదికన ఉండాలని ఆయన షరతు విధించారు. దేశవ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలను భద్రతా దళాలు అణచివేసిన తర్వాత పరిస్థితి పూర్తి నియంత్రణలో ఉందని అరాగ్చీ తెలిపారు. ట్రంప్ జోక్యం చేసుకునేందుకు సాకుగా ఉపయోగపడేందుకు ఇరాన్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశ విదేశాంగ మంత్రికి, అమెరికా అధ్యక్షుడి ప్రత్యేక రాయబారికి మధ్య సంప్రదింపులకు ఎటువంటి అవరోధాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాగ్చీ తెలిపారు.
