United Nations: రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ పలు సంస్థలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీని ఎఫెక్ట్, తాజాగా ఐక్యరాజ్యసమితి పైనా పడింది. పలు సంక్షోభ ప్రాంతాల్లో ఉన్న తమ శాంతి పరిరక్షకులను కుదించి తిరిగి వెనక్కి రప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే, ఓ ప్రైవేట్ మీటింగ్ చర్చ అనంతరం ఐరాస సీనియర్ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియజేశారు. యూఎన్‌కు పెద్ద మొత్తంలో నిధులు అందించే అమెరికా.. ట్రంప్ నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంతి పరిరక్షక దళాల నుంచి 25 శాతం తగ్గించినట్లు పేర్కొన్నారు. తొమ్మిది మిషన్‌లలో భాగంగా 50 వేల కంటే ఎక్కువ మంది శాంతి పరిరక్షకులను ఐక్యరాజ్య సమితి మోహరించింది. కాగా, ట్రంప్ కోతలతో 13 నుంచి 14 వేల మంది సైనిక, పోలీసు సిబ్బందిని వెనక్కి రప్పించినట్లు తెలియజేశారు. సోమాలియాలోని యూఎన్ సహాయ ఆఫీసుపై కూడా దీని ఎఫెక్ట్ పడనుంది. వచ్చే ఏడాది శాంతి పరిరక్షణ దళానికి అందించే 5.4 బిలియన్ డాలర్ల బడ్జెట్‌లో కూడా 15 శాతం మేర తగ్గించాలని అమెరియా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Read Also: Bakasura Restaurant : 250 మిలియన్ల మైలురాయిని చేరుకున్న.. ‘బకాసుర్ రెస్టారెంట్’
అయితే, కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, దక్షిణ సూడాన్, లెబనాన్, సైప్రస్, కొసావో లాంటి దేశాల్లో ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, యూఎస్ రాయబారి మైక్‌వాల్జ్‌తో సహా మరి కొంతమందితో ఇటీవల జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. శాంతి పరిరక్షక ప్రయత్నాలకు 680 మిలియన్ డాలర్లు యూఎన్‌కు ఇచ్చేందుకు యూఎస్ ఒప్పుకుంది. గతంలో అగ్రరాజ్యం అందించిన దానికంటే ఇది చాలా తక్కువని యూఎన్ అధికారి తెలియజేశారు.  
