బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్ మాల్యా… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల వివరాలను పలు బ్యాంకులు దాచిపెట్టాయని ఆరోపించారు. రికవరీ చేసుకున్న నిధుల వివరాలను అధికారికంగా వెల్లడించలేదన్నారు. రూ.14,100 కోట్ల మేర బ్యాంకులు రికవరీ చేసినట్లు భారత కేంద్ర ఆర్థిక మంత్రి స్పష్టంచేసినా… బ్యాంకులు మాత్రం ఆ వివరాలు బయటపెట్టకపోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రికవరీ చేసుకున్న సొమ్ముపై భారత బ్యాంకులు పూర్తి రికవరీ వివరాలను వెల్లడించేవరకు తాను యూకేలో ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోనని విజయ్ మాల్యా పేర్కొన్నారు. కాగా కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం తాను తీసుకున్న రుణాలకు అనేక రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలుచేశాయని.. అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని విజయ్ మాల్యా పలుమార్లు భారత్‌లోని కోర్టులకు తెలియజేశారు. ఆయన తీసుకున్న రుణంలో దాదాపు రూ.10,200 కోట్లు చెల్లించినట్లు రికవరీ అధికారి సైతం తెలిపారు. అయితే తాను పూర్తి రుణం చెల్లించినప్పటికీ… ఇంకా రికవరీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని ఆరోపిస్తూ మాల్యా ఆగ్రహం వ్యక్తంచేశారు.
కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల విషయంలో మోసం చేసినట్లు విజయ్ మాల్యా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశం విడిచి వెళ్లిపోయిన ఆయన మార్చి 2016 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్నారు. మాల్యాను భారత్‌కు రప్పించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్న విషయం విధితమే. తాను తీసుకున్న రుణాలకు పలు రెట్లు బ్యాంకులు తన నుంచి వసూలుచేశాయని.. అందుకు సంబంధించిన అకౌంట్ స్టేట్‌మెంట్లను అందించాలని కోరుతూ ఆయన ఇటీవల కర్ణాటక హైకోర్టును (Karnataka High Court) ఆశ్రయించారు.
బెంగళూరు రోడ్లపై విదేశీ విజిటర్ తీవ్ర వ్యాఖ్యలు
బెంగళూరు రోడ్లు ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా తాజాగా ఈ అంశంపై స్పందించారు. తన బయోకాన్ పార్క్ ఆఫీస్‌లో విదేశానికి చెందిన బిజినెస్ విజిటర్ చేసిన వ్యాఖ్యలతో ఆమె ఇబ్బందిపడ్డారు. ఆ విషయాన్ని వెల్లడిస్తూ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేశారు. ‘‘బయోకాన్ పార్క్‌కు ఇటీవల ఓ విదేశీ బిజినెస్ విజిటర్ వచ్చారు. అప్పుడు ఆ వ్యక్తి నాతో… ‘రోడ్లు ఎందుకు ఇంత దారుణంగా ఉన్నాయి. చుట్టూ ఎందుకు ఇంత చెత్త ఉంది..? పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలనుకోవట్లేదా? నేను ఇప్పుడే చైనా నుంచి వచ్చాను. ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉన్నా, ఎందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నారో అర్థం కావడం లేద’ని అన్నారు’’ అని మజుందార్ షా తన పోస్టులో పేర్కొన్నారు.
భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో గుంతలమయమైన బెంగళూరు రహదారులపై గతంలోనూ ఓ సీఈఓ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘‘గతంలో ఇంటినుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. ఇప్పుడు అది కఠినంగా మారిపోయింది. ఆఫీసుకు రావాలంటే మా ఉద్యోగులకు గంటన్నర పడుతుంది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి. గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదు. మేము ఇక్కడినుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం’’ అని బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. రోడ్లు, డ్రైనేజీ, ఫ్లైఓవర్ మరమ్మతులకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఐటీ పార్క్‌లను తాత్కాలికంగా మూసివేయాలని టెకీలు, స్థానికులు పిలుపునిచ్చారు.
స్పందించిన కర్ణాటక మంత్రి
కిరణ్ మజుందార్ చేసిన పోస్ట్‌పై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ‘‘వారు బెంగళూరులో ఏ ప్రాంతంలో పర్యటించారో నాకు కచ్చితంగా తెలియదు. అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. మౌలిక సదుపాయాల విషయంలో ఏది అవసరమో అది చేస్తున్నాం’’ అని బదులిచ్చారు. మజుందార్ షా ట్యాగ్ చేసిన వారిలో ఈ మంత్రి పేరు కూడా ఉంది. కాగా.. ఈ విమర్శల వేళ ‘మిషన్ ఫ్రీ ట్రాఫిక్ – 2026’ను రాష్ట్రప్రభుత్వం ప్రారంభించింది. దీనికింద 90 రోజుల్లో 1600కి.మీ. మేర రోడ్లకు మరమ్మతులు చేయడం, పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో 2026 మార్చికి కొంతమేర ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంచనా వేస్తున్నారు.
The post Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్ మాల్యా తీవ్ర విమర్శలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
