రాష్ట్రంలో రైతులు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. కృష్ణా జిల్లా రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, బీవీ తోట ఎస్.ఎన్. గొల్లపాలెంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా పంట పొలాల్లో దిగి పరిశీలించారు. అదే సమయంలో రైతన్నతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ధీమా కల్పించారు. మోంథా తుపానుతో నష్టపోయిన రైతన్నలను ఆదుకోకపోతే వైఎస్సార్‌సీపీ మరో పోరాటం చేయడానికి కూడా వెనుకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు.. రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆ రహదారులన్నీ జనసంద్రమయ్యాయి. విజయవాడ నుండి గొల్లపాలెం వరకు అడుగడుగునా భారీ జనసందోహమే కనిపించింది. దాంతో ఆ భారీ జనసందోహనికి అభివాదం చేస్తూ జగన్ పర్యటన ముందుకు సాగింది. దీనిలో భాగంగా వైఎస్ జగన్ పర్యటన ఆలస్యమైంది. సుమారు ఐదు గంటలు ఆలస్యంగా వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. మిట్ట మధ్యాహ్నం ఎండలోనూ జగన్ కోసం రైతులు, మహిళలు, కార్యకర్తలు వేచి చూడగా, పొలాల్లో నుండి సైతం వచ్చి జగన్‌ను కలిశారు రైతన్నలు. తుపానుతో తాము నష్టపోయిన విషయాలను జగన్ కు వివరించారు.
మొంథా తుపాన్ దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపింది. ఇటు గోదావరి జిల్లాల నుంచి శ్రీకాకుళం, అటు రాయలసీమలో కర్నూలు జిల్లా వరకు తుపాన్ ప్రభావం చూపింది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ ఊహించని విధంగా పంట నష్టం జరిగింది. కారణం ఏమిటంటే, ఇప్పుడు నష్టపోయిన పంటల్లో దాదాపు 11 లక్షల ఎకరాల్లో వరి పంట ఉంది. అది పొట్టకొచ్చే దశలో ఉంది. అంటే గింజలు తయారయ్యే పరిస్థితి. ఈదురుగాలులు, భారీ వర్షాలతో చాలా నష్టం సంభవించింది. ఇంకా పత్తి, మొక్కజొన్న, బొప్పాయి మరో దాదాపు 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 16 సార్లు ప్రకృతి వైపరీత్యాలు సంభవించి, రైతులు నష్టపోయారు. ఈ 18 నెలల్లో 16 సార్లు అలా రైతులు ఇబ్బంది పడ్డారు. మరి ఏ ఒక్క రైతుకు అయినా ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఇన్సూరెన్స్ డబ్బు అందిందా? పెట్టుబడి సాయం మొత్తం చేశారా? అంటే అదీ లేదు. రెండేళ్లకు కలిపి రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారు. ఇన్ని ఇబ్బందులు పడి, నష్టం జరిగినా ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. అదే మా ప్రభుత్వంలో ఉచిత పంటల బీమా పక్కాగా అమలు చేశాం. దీంతో ఏ రైతు ఇబ్బంది పడలేదు.
అప్పుడు మూడు ఎకరాలున్న రైతులకు దాదాపు రూ.70 వేల పరిహారం అందింది. అదే ఇప్పుడు చివరకు ఇప్పుడు యూరియా కూడా బ్లాక్‌లో కొనాల్సి వచ్చింది. బస్తా యూరియా దాదాపు రూ.600కు కొనాల్సి వచ్చింది. ఇంకా ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.1750 ఉంటే రైతుకు రూ.1300 కూడా రావడం రాలేదు. ఏ ఒక్క పంటకూ కనీస గిట్టుబాటు ధర రాలేదు.
అందుకే అందరూ మా ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటున్నారు. నాడు ఏం జరిగినా రైతులు ఆందోళన చెందలేదు. జగనన్న ఉన్నాడు. ఆదుకుంటాడు అన్న భరోసా ఉండేది. ఉచిత పంటల బీమా ఉంది. ఇన్‌పుట్ సబ్సిడీ కూడా వస్తుంది. ఏటా సీజన్ ఆరంభంలో పెట్టుబడి సాయం చేస్తాడు. అలా ఏటా రూ.13,500 తప్పనిసరిగా ఇస్తాడు అన్న నమ్మకం రైతుల్లో ఉండేది. అలా వారిలో ఒక భరోసా ఉండేది. రైతులను చేయి పట్టి ఆర్బీకేలు నడిపించేవి. ప్రతి ఎకరా ఈ–క్రాప్ జరిగేది. ఆర్బీకేల్లో అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఉండేవారు. వారు పక్కాగా ఈ–క్రాప్ నమోదు చేసే వారు. దాంతో ఏ పంటకు, ఏ ఇబ్బంది వచ్చినా, ఈ–క్రాప్ ఉంది కాబట్టి ప్రభుత్వం తోడుగా నిలబడేది.
ఆర్బీకేలు జోక్యం చేసుకుని పంటలు కొనుగోలు చేసేవి. తద్వారా రైతులకు కనీస మద్దతు ధర వచ్చేది. ఎక్కడైనా ధరలు తగ్గితే, ఆర్బీకేల్లోని అగ్రికల్చర్ అసిస్టెంట్ జిల్లా జేసీకి సమాచారం ఇస్తే, వారు వెంటనే జోక్యం చేసుకుని, మార్కెట్‌లో పంటలు కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడేవారు. సీఎం–యాప్ ద్వారా ప్రతి రైతుకు ఆర్బీకేల్లో ఆసరగా నిల్చేవాళ్లం. దాదాపు రూ.7800 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాం. అందుకోసం ఏటా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం.
జగన్ పై మంత్రి లోకేశ్ సెటైర్లు
అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే జగన్ గారు.. ఎప్పుడూ జనం మధ్య ఉండే మా వైపు ఒక వేలెత్తి చూపిస్తున్నారు. మీ వైపు 4 వేళ్లు చూపుతున్నాయని మర్చిపోతున్నారు. తుఫాను హెచ్చరిక వచ్చిన నుంచీ సాధారణ పరిస్థితి నెలకొనే దాకా ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకు.. చీఫ్ సెక్రటరీ నుంచి విలేజ్ సెక్రటరీ వరకు అంతా ప్రజల చెంతే ఉన్నాం. ప్రజల్ని ఆదుకున్నాం. ఇవన్నీ మీకు తెలియడానికి మీరు ఇక్కడ లేరు. మీది వేరే భ్రమాలోకం. అందులో విహరిస్తుంటే, ఇవన్నీ తెలియవు. నాకు మహిళలంటే గౌరవం, దేశమంటే భక్తి. అందుకే మహిళల వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లాను. కోట్లాది భారతీయులు తలెత్తుకునేలా మహిళా మణులు వరల్డ్ కప్ గెలిస్తే, నేనే గెలిచినంత ఆనందించాను. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి, మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే అంటూ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ లో సెటైర్లు వేసారు.
The post YS Jagan: మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటన appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
