తమిళనాడు : నదుల అనుసంధానానికి మోదీ కృషి చేస్తున్నారని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరులో ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టారు. అంతకు ముందు కోయంబత్తూరులో స్థానిక వ్యాపారవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సమావేశమయ్యారు. కోయంబత్తూరు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న ఎన్డీఏ అభ్యర్ధులు హాజరయ్యారు. నార్త్ నుంచి పోటీ చేస్తున్న వానతి శ్రీనివాసన్, కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేస్తున్న అమ్మన్ కే. అర్జున్, సింగనల్లూర్ నుంచి పోటీ చేస్తున్న కేఆర్ జయరామన్, కౌండంబాలాయం నుంచి పోటీ చేస్తున్న అరుణ్ కుమార్, సూలూర్ నుంచి పోటీ చేస్తున్న కందస్వామి ఉన్నారు.
ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించాలని కోరారు నారా చంద్రబాబు నాయుడు. తమిళనాడుతో ఏపీకి.. ఎన్టీఆర్ కు, తనకు ఉన్న అనుబంధాన్ని సమావేశంలో వివరించారు. ఎన్టీఆర్ హయాంలోనే తెలుగు గంగ ద్వారా చెన్నైకు నీరిచ్చామని అన్నారు. నదుల అనుసంధానం జరిగితే గోదావరి నీళ్లను తమిళనాడుకు ఇవ్వవొచ్చని చెప్పారు. ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి జరుగుతోందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని వివరించారు సీఎం. మహిళా రిజర్వేషన్ బిల్లు, డిలిమిటేషన్ బిల్లును అడ్డుకుని డీఎంకే సహా ఇండి కూటమి భాగస్వామ్య పక్షాలు తప్పు చేశాయన్నారు. కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరిగేదన్నారు. డీఎంకే సహా ఇండి కూటమి తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల మహిళలకు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
The post నదుల అనుసంధానంతో తమిళనాడుకు నీళ్లు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
