ముంబై : బీజేపీ మహిళా ర్యాలీ నిర్వహించడం , ట్రాఫిక్ జామ్ కావడంతో ఓ సామాన్య మహిళ రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ ను నిలదీసింది. అడ్డుకోబోయిన పోలీస్ ఆఫీసర్ ను ఏకి పారేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ సందర్బంగా బీజేపీ, మంత్రి నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ ఆ క్లిప్‌ను షేర్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై అధికార పార్టీ ప్రచారం దాని నిజ స్వరూపాన్ని బయట పెట్టిందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మహిళలను తప్పుదారి పట్టిస్తోందని, ఒక ‘తప్పుడు కథనాన్ని’ ప్రచారం చేయడానికి ఈ అంశాన్ని ఒక సాధనంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు.
రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగ, ఎన్నికల ప్రక్రియలను మార్చాలన్న బీజేపీ ప్రయత్నాన్ని ప్రతిపక్ష కూటమి ఇప్పటికే అడ్డుకుందని అన్నారు. ఇప్పుడు ఆ కాషాయ పార్టీ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకు రావడానికి ర్యాలీలు, ప్రచారాలకు పాల్పడుతోందని సప్కల్ ఆరోపించారు. మాజీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే కూడా ఈ వీడియోను పోస్ట్ చేశారు. బీజేపీ ఆడుతున్న నాటకాల కారణంగా సామాన్య పౌరులు వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఆ మహిళ వ్యక్తం చేసిన ఆగ్రహం ప్రజల్లో పెరుగుతున్న అసహనాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు కూడా ఇదే రీతిలో బీజేపీని తిరస్కరిస్తారని ఆయన ఉద్ఘాటించారు.
The post మంత్రి గిరీష్ మహాజన్ నిర్వాకం కాంగ్రెస్ ఆగ్రహం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
