హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ నేపథ్యంలో డిప్యూటీ సీఎం, ప్రజా భవన్లో విద్యుత్ సరఫరాపై ఇంధన శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా విద్యుత్ మార్కెట్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ, రాష్ట్ర అవసరాలకు ఏమాత్రం లోటు రాకుండా పవర్ ఎక్స్ఛేంజీల ద్వారా అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఆసుపత్రులు, తాగునీటి సరఫరా పథకాలు మరియు అత్యవసర సేవలకు విద్యుత్ అంతరాయం కలగకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను పూర్తి స్థాయిలో వినియోగించు కోవాలని, జల విద్యుత్ ఉత్పత్తిని సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున, అన్ని విద్యుత్ సంస్థలూ సమన్వయంతో పనిచేస్తూ ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమని స్పష్టం చేశారు మల్లు భట్టి విక్రమార్క. సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, జెన్కో సీఎండీ హరీష్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
The post రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
