Skip to content
Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Information Bazaar

Building Demolition and Dismantling contractor @ 9440969690

Diwali | మనలోని తేజమే మహా దీపమై.. అజ్ఞానపు అంధకారాల్ని తరిమేసే దీపావళి

Ai generated article, credit to orginal website, October 20, 2025

ప్రమిద భూ తత్వం.. తైలం జల తత్వం.. వత్తి ఆకాశ తత్వం వెలగడానికి తోడ్పడే గాలి వాయు తత్వం.. వెలిగే జ్యోతి అగ్ని తత్వం ఇలా పంచభూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం. మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్నివెలిగించడం అంటే మనలోని ఆత్మ జ్యోతిని వెలిగించడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపజేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే. మనలోని తేజస్సే మహా దీపం. ఆ తేజోపుంజాన్ని ప్రజ్వలింప జేసే సాధనకు వేదిక దీపావళి (Diwali). మనలో ముసురుకున్న చీకట్లను తరిమేసే అవకాశం ఇస్తుంది ఈ పండుగ.
దీపం ఎప్పుడూ ఊర్ధ్వ దృష్టినే కలిగి ఉంటుంది. దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్లే.. మనసును అల్ప విషయాలవైపు మళ్లించకుండా ఊర్ధ్వ దృష్టిని కలిగి ఉండటమూ నేర్చుకోవాల్సిన పాఠమే. సృష్టి, స్థితి, లయలకు దీపంతో సన్నిహితమైన సంబంధం ఉంది. దీపం ప్రజ్వలించినప్పుడు వచ్చే ఆ కాంతిని త్రిమూర్తులకు ప్రతీకగా మన రుషులు పేర్కొన్నారు. ఆ కాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల వర్ణం స్థితికారుడైన విష్ణువుకు, శ్వేత వర్ణం లయకారుడైన శివుడికి, ఎరుపు సృష్టికర్త బ్రహ్మకు సంకేతాలుగా అభివర్ణించారు. విద్య, శక్తి, సంపదలను ప్రసాదించే ముగ్గురమ్మలు సరస్వతి, దుర్గ, లక్ష్మి.. ఆ కాంతిలో కొలువై ఉంటారని పెద్దలు అంటారు.
‘వైరాగ్య తైల సంపూర్ణే, భక్తి వర్తి సమన్వితే/ ప్రబోధ పూర్ణ పాత్రేతు జ్ఞానదీపం విలోక్యత్‌’ అని ఆర్ష వాక్కు. అంటే ‘ప్రబోధం’ అనే ప్రమిదలో, ‘వైరాగ్యం’ అనే చమురు పోసి, ‘భక్తి’ అనే వత్తిని వెలిగించి, జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేయాలని దీని అర్థం. ఆ జ్యోతి ప్రసరించే ప్రకాశాన్ని దర్శించినవారు ముక్తి పొందారు. ముక్తిని ప్రసాదించేవాడు పరమాత్మ. ఆ పరమాత్మకు సంకేతం జ్యోతి. ‘పరమాత్మే పరంజ్యోతి’ అని వేదం చెబుతున్నది. పరమాత్మ యజ్ఞ స్వరూపుడు. యజ్ఞ చిహ్నాన్ని దీపంగా భావిస్తారు. జ్యోతి లేదా దీప ప్రజ్వలన అంటే యజ్ఞం చేయడమే! దీపావళి రోజున దీపాలను ప్రజ్వలింప జేసి, జగన్మాతకు ధారపోసి, భక్తి ప్రపత్తులను సమర్పించుకోవడమే దీప యజ్ఞం. ఆ దీపాలను ఇంటి ముంగిట, దైవీ వృక్షాల చెంత, ఇంటిలోని ద్వారాల దగ్గర వరుసలుగా పేర్చడం దీపయజ్ఞంలో భాగమే.

దీపావళి పర్వాన్ని గురించి పురాణేతిహాసాలు విస్తృతంగా ప్రస్తావించాయి. రామాయణంలో రఘుకులాన్వయ దీపునిగా రాముణ్ని కీర్తిస్తూ, వనవాసం తర్వాత సీతారాముల పట్టాభిషేక సమయంలో అయోధ్యలో ప్రజలు దీపోత్సవం జరుపుకొన్నారట. కురుక్షేత్ర సంగ్రామం అనంతరం ధర్మరాజు విజయుడై పట్టాభిషేకం చేసుకున్న సందర్భంలో హస్తినాపుర ప్రజలు సంతోషంగా దీపాలను వెలిగించి పండగ చేసుకున్నారని మహాభారతం చెబుతున్నది. నచికేతుడు తన మేధస్సుతో యముడిని సంతృప్తిపరచి, ఆత్మను గురించి తెలుసుకున్నాడు. యముడి నుంచి స్వేచ్ఛ పొంది, నచికేతుడు తిరిగి భూలోకానికి వచ్చిన సందర్భంలో జరిగిన దీపోత్సవమే దీపావళి అని ‘కఠోపనిషత్తు’ కథనం. క్షీరసాగర మథన సమయంలో అవతరించిన శ్రీమహాలక్ష్మికి దీపాలను వెలిగించి దేవతలు స్వాగతం పలికారని ‘పద్మపురాణం’ పేర్కొంటున్నది. దుష్ట దనుజులను దునుమాడిన మహాకాళిని జ్యోతిగా, లక్ష్మీస్వరూపంగా ఆరాధించినట్టు కాళికాపురాణం చెబుతున్నది.
దీపావళిని ‘దీపాన్విక’గా భవిష్య, నారద పురాణాలు పేర్కొన్నాయి. స్కాంద పురాణంలో దీపావళి గురించిన వివరణ విస్తారంగా ఉంది. నారద పురాణం దీన్ని ‘దీప దాన మహోత్సవం’ అని చెప్పింది. ముద్రారాక్షస గ్రంథం ‘శారదోత్సవం’గా, నాగానందం గ్రంథంలో ‘దీపప్రతిపాదనోత్సవం’గా దీపావళిని పేర్కొన్నారు. ‘దీపేన సాధ్యతే సర్వం’ అని శాస్త్రవచనం. ‘దీపంతో దేనినైనా సాధించవచ్చు’ అని దీని భావం. నిత్యం దీపారాధన భారతీయుల సంప్రదాయం. ఉభయ సంధ్యల్లో ఇంట్లో వెలిగించే దీపం ఐశ్వర్య కారకం అని ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. ‘ఏదైనా కోరిక తీరాలంటే, ఒక దీపాన్ని వెలిగించి- ఖర్జూరమో, ఎండుద్రాక్షో మరేదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరిస్తే చాలు’ ఐహిక భోగాలు సిద్ధిస్తాయని శాస్ర్తోక్తి.
దేవతలు ప్రకాశ స్వరూపులు. కాంతి-శుభానికి, జ్ఞానానికి, శాంతికి సంకేతం. జ్యోతిని వెలిగించడంతోనే శుభాలు ప్రారంభమవుతాయి. తేజోమయులైన దేవతలు దీపం ద్వారా సంతోషించి, ఆ దీపాన్ని వెలిగించిన వారికి సన్నిహితులు అవుతారని పురాణ రుషులు దర్శించారు. దీపకాంతి దివ్యత్వానికి ప్రతీక. ‘దీపం ఉన్న చోట దేవతలు ఉంటారు’ అనడం వెనుక ఆంతర్యం ఇదే! కేవలం దీపాన్ని మాత్రమే వెలిగించి, ఆ జ్యోతిని ఆలంబనగా పరంజ్యోతి అయిన పరమాత్మను ధ్యానించడం ఒక యోగ ప్రక్రియ. భర్తృహరి తన శతక సాహిత్యంలో పరమేశ్వరుని ‘జ్ఞానదీపం’గా అభివర్ణించాడు. ఈ దీపం యోగుల హృదయ గృహంలో సుస్థిరంగా దీపిస్తున్నదని ఆయన సంభావించాడు.

మంత్రశాస్త్ర ప్రకారం ‘సాక్షాత్‌ దీపం దర్శయామి’ అనే మంత్రం చదువుతూ దీపం పెట్టడం వల్ల సకల దుష్టగ్రహ శక్తులు నశించి పరిసర వాతావరణం పరిశుభ్రం అవుతుంది. అప్పుడే ఆ గృహానికి పూజార్హత లభిస్తుంది. దీపం వెలిగించగానే ఇంటికి లక్ష్మీకళ వచ్చేస్తుంది. లక్ష్మీదేవి దీపవాసిని. దీపకాంతి నుంచే కళ పుడుతుంది. దీపం అమంగళాన్నీ, దారిద్య్రాన్నీ, అరిష్టాల్నీ పారద్రోలే శక్తి స్వరూపం. దీపం వెలగని ఇంట్లో అలక్ష్మి తాండవిస్తుందంటారు పెద్దలు. పూర్వకాలంలో ప్రతి ఇంటా నిత్యం అగ్నిహోత్రం నిర్వహించేవారు. కానీ, నేటి పరిస్థితుల దృష్ట్యా రోజూ అగ్నిహోత్రం వెలిగించడం సాధ్యం కాదు. కానీ, ఇంట్లో రోజూ ఉదయం, సాయంకాలం దీపారాధన చేయడం శుభప్రదం. మరణించిన వ్యక్తులకు ఉత్తమ గతులు సిద్ధించాలన్నా దీపాలు వెలిగించాలని శాస్ర్తాలు చెబుతున్నాయి. అలాంటి దీపాలకు ఆలవాలం దీపావళి. ఈ పండుగ సందర్భంగా ఇంట్లో, ఇంటి ఆవరణలో మాత్రమే కాదు.. మనసులోనూ దీపాలు వెలగించండి. ఆ కాంతులు మన జీవితాలను తేజోమయం చేస్తాయి అనడంలో సందేహం లేదు.
ఆనంద తారావళి దీపావళి
దీపావళి పండుగ అనగానే నరకాసురుడిని శ్రీకృష్ణుడు సంహరించిన కథ మనకు గుర్తుకువస్తుంది. దీంతోపాటు మరెన్నో చారిత్రక సందర్భాలు కూడా దీపావళి ప్రాభవానికి ఆధారాలుగా ఉన్నాయి. రావణాసురుడిని సంహరించిన శ్రీరాముడు తిరిగి అయోధ్యకు వచ్చి భరతుడిని కలుసుకున్న రోజు దీపావళి. రాక్షసరాజైన బలి చక్రవర్తిని వామనుడు పాతాళానికి పంపించింది కూడా దీపావళి రోజునే. దీపావళి రోజు నుంచే విక్రమార్క శకం ప్రారంభమైంది. మహాపురుషుడైన వర్థమాన మహావీరుడు దీపావళి రోజునే సిద్ధిపొందాడు. భిన్న సంస్కృతులు, ఆచారాలకు నిలయమైన మనదేశంలో దీపావళి పండుగలో కూడా ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి. ఉత్తర భారతదేశంలో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకొంటారు. మొదటి రోజు ధన త్రయోదశి, రెండో రోజు నరక చతుర్దశి, మూడోరోజు దీపావళి, నాలుగోరోజు బలి పాడ్యమి, ఐదో రోజు యమద్వితీయ ఇలా ఐదు రోజులు పండుగ చేసుకుంటారు. దక్షిణ భారతదేశంలో నరకాసుర వధకు చిహ్నంగా దీపావళి చేసుకుంటారు. ఇందుకు భిన్నంగా ఉత్తర భారతదేశంలో రావణాసురవధకు గుర్తుగా దీపావళి జరుపుకుంటారు.
డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ

Top Stories

Post navigation

Previous post
Next post

Recent Posts

  • పేద‌ల సంక్షేమం ప్ర‌భుత్వ ల‌క్ష్యం : సీఎం
  • బాలిక‌ల‌కు ఉచితంగా శానిట‌రీ న్యాప్కిన్ల పంపిణీ
  • చంద్ర‌బాబు హ‌యాంలోనే కాపుల అభివృద్ది
  • టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతల స్వీక‌ర‌ణ‌
  • 8న ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

Recent Comments

No comments to show.

Archives

  • March 2026
  • February 2026
  • January 2026
  • December 2025
  • November 2025
  • October 2025
  • September 2025

Categories

  • Blog
  • Celeb Gallery
  • Gossip
  • Movies
  • Top Stories
©2026 Information Bazaar | WordPress Theme by SuperbThemes