హైదరాబాద్ : పవిత్రమైన చార్ధామ్ యాత్ర నేడు(ఆదివారం ఏప్రిల్19) ప్రారంభం కానుంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరవనున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో గంగా మాత, యమునా మాతలను దర్శించుకొని మొక్కులు చెల్లిస్తారు. చార్ధామ్ యాత్రలో, కేదార్నాథ్ దేవాలయాన్ని ఏప్రి 22న, బద్రీనాథ్ దేవాలయాన్ని ఏప్రి 23న తెరుస్తారు. ఆలయాలు తెరువడంతో ఈ యాత్ర కొనసాగుతుంది. శీతాకాలంలో ఈ నాలుగు దేవాలయాలను మూసివేస్తారు. దేశవిదేశాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
భక్తుల భద్రత కోసం యాత్ర మార్గాల్లో ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ సిబ్బంది, పారామిలిటరీ దళాలను మోహరించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బందిని కూడా మోహరించారు. యాత్రికులు చార్ధామ్ యాత్ర కోసం తప్పనిసరిగా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అధికారిక ఉత్తరాఖండ్ పర్యాటక పోర్టల్స్ లేదా అధికారిక ఆఫ్లైన్ కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
