తిరుపతి : సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యాల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు, ఫలములను స్వామివారికి సమర్పించి కలియుగ వైకుంఠ వాసుడు శ్రీనివాసుని అనుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవాల అంతరార్థమని అర్చకులు తెలిపారు. భక్తుల హృదయాలలో భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపే ఈ ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
వైఖానస మాసంలోని శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ మూడు రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయం 8.30 గంటలకు మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేయగా, గోవింద నామాలతో ఆలయ వీధులు మారుమోగాయి. మధ్యాహ్నం 2.00 గంటల నుండి 4.00 గంటల వరకు వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పుష్పాలతో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను పరవశింపజేసింది. అనంతరం ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తిరువీధుల ఉత్సవంలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చి అనుగ్రహించారు
వసంతోత్సవాలను పురస్కరించుకొని మూడు రోజుల పాటు నిర్వహించే ఆర్జిత సేవలైన నిత్య కల్యాణోత్సవం, తిరుప్పావడ సేవలను టిటిడి రద్దు చేసింది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
The post ఘనంగా శ్రీనివాస మంగాపురం వసంతోత్సవాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
