Karisma Kapoor | ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తాజాగా పాపరాజీల ప్రవర్తనపై సున్నితంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5 షూటింగ్ ముగించుకుని బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షూటింగ్ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన కరిష్మాను ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టారు. ఈ సమయంలో కొందరు కెమెరాలను ఆమెకు అత్యంత దగ్గరగా తీసుకెళ్లి జూమ్ చేయడం ఆమె గమనించారు. వెంటనే స్పందించిన కరిష్మా, “జూమ్ మత్ కర్నా” (అంతగా జూమ్ చేయకండి) అంటూ వారిని హెచ్చరించారు. ఆమె మాటలు కాస్త సీరియస్‌గా ఉన్నప్పటికీ, చెప్పే విధానం మాత్రం సున్నితంగా ఉండటం గమనార్హం.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి కరిష్మాకు భారీ మద్దతు లభిస్తోంది. సెలబ్రిటీలు కూడా సాధారణ మనుషులేనని, వారి వ్యక్తిగత గౌరవం, ప్రైవసీ కాపాడాల్సిన బాధ్యత అందరిదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇద్దరు పిల్లల తల్లి, అనుభవజ్ఞురాలైన నటి ఇలా ఫోటోగ్రాఫర్లకు పద్ధతులు చెప్పాల్సి రావడం బాధాకరం అంటూ ఒక యూజర్ కామెంట్ చేయగా, మరికొందరు పాపరాజీలు అతిగా వ్యవహరించడాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఇదే మొదటిసారి కావు. గతంలో శృతి హాసన్, జయా బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఫోటోగ్రాఫర్ల అత్యుత్సాహంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా శృతి హాసన్‌ను ఇటీవల “మమ్మీ” అని పిలవడంతో ఆమె తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే.
ఇక వృత్తిపరంగా చూస్తే, కరిష్మా కపూర్ ప్రస్తుతం బుల్లితెరపై బిజీగా ఉన్నారు. మే 9, 2026 నుంచి సోనీ టీవీలో ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్ సీజన్ 5 ప్రారంభం కానుంది. ఈ షోలో కరిష్మాతో పాటు గీతా కపూర్, టెరెన్స్ లూయిస్, జావేద్ జాఫేరి జడ్జ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. కరిష్మా కపూర్ చివరగా మర్డర్ ముబారక్ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె “బ్రౌన్” అనే ఓటీటీ సిరీస్‌లో నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. కపూర్ కుటుంబం నుంచి వచ్చిన ప్రముఖ నటి అయిన కరిష్మాకు ఇప్పటికీ అదే స్థాయిలో క్రేజ్ కొనసాగుతుండటం ఈ సంఘటనతో మరోసారి స్పష్టమైంది.
