Tabu | కింగ్ అక్కినేని నాగార్జున తన సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచే 100వ చిత్రంలో నటిస్తున్నారు. రా. కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రస్తుతం ‘కింగ్ 100’ (వర్కింగ్ టైటిల్) గా నిర్మిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటనలు లేకుండా సైలెంట్‌గా చిత్రీకరణ కొనసాగుతుండగా, ఇప్పుడు ఒక కీలక అప్డేట్ బయటకు వచ్చింది. సీనియర్ నటి టబు ఈ చిత్రంలో భాగమవుతున్నట్లు స్వయంగా ఆమెనే ప్రకటించారు. ఒక కుర్చీపై ‘కింగ్ 100’ క్లాప్ బోర్డ్ ఉంచిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న టబు, అన్నపూర్ణ స్టూడియోస్‌ను ట్యాగ్ చేస్తూ నాగార్జున పేరుతో హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. దీంతో ఈ సినిమాలో ఆమె హీరోయిన్గా నటిస్తున్న విషయం స్పష్టమైంది. ఇదే ఈ చిత్రానికి సంబంధించిన తొలి అధికారిక సమాచారం కావడం విశేషం.
గతంలో ‘సిసింద్రీ’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జున–టబు జంట ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఒకప్పుడు తమ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ జంట మరోసారి ఏ రేంజ్లో మెప్పిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన 100వ సినిమాలో నటించాలని టబు ప్రత్యేకంగా ఆసక్తి చూపిందని తెలిపారు. తన కెరీర్లో మైలురాయి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు.
ఇక ఈ చిత్రంలో టబుతో పాటు మరో ఇద్దరు కథానాయికలు కూడా నటిస్తున్నారు. ఇప్పటికే ఐశ్వర్య రాజేష్ ఖరారైనట్లు సమాచారం. అలాగే సుస్మితా భట్ కూడా మరో హీరోయిన్గా నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రీకరణ శరవేగంగా సాగుతుండగా, త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. నాగార్జున 100వ చిత్రంగా వస్తున్న ‘కింగ్ 100’లో టబు ఎంట్రీ ఖాయం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి, అంచనాలు మరింతగా పెరిగాయి.
