Virosh | ఫిబ్రవరి 26న అంగరంగ వైభవంగా జరిగిన విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహ వేడుక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మార్చి 4న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో విజయ్–రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ నాయకులు, పలువురు జాతీయ నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం. వీఐపీలు పెద్ద ఎత్తున రానుండటంతో హోటల్ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ పరిమితులు, ప్రత్యేక చెకింగ్‌లు ఉండనున్నాయి.
ఈ క్రమంలో విజయ్–రష్మిక టీమ్ ఒక అధికారిక లేఖ విడుదల చేసింది. అందులో రిసెప్షన్ కార్యక్రమం పరిమిత ఆహ్వానితులకే పరిమితమని స్పష్టం చేసింది. ఆహ్వానం లేని వారు కార్యక్రమానికి రాకూడదని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు. మీ క్షేమమే మాకు ముఖ్యమైంది. మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీర్వాదాలు మాకు అందుతాయని నమ్ముతున్నాం. ఆహ్వానం లేకుండా వచ్చి ఇబ్బందులు పడకండి” అని జంట అభిమానులను కోరింది. ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఎలాంటి అనుమతి లేకుండా హోటల్ పరిసరాలకు రావడం కష్టమవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల ఆహ్వానం లేని అభిమానులు రిసెప్షన్‌కు హాజరుకావడానికి ప్రయత్నించకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు.
మొత్తానికి, విజయ్–రష్మిక రిసెప్షన్ వేడుక ఘనంగా జరగనుండగా, అభిమానులు దూరం నుంచే తమ ఆశీస్సులు అందించాలని జంట కోరుతోంది. ఇక పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ-రష్మికలు పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నిన్న జూబ్లిహిల్స్ టీటీడీ ఆఫీసుకి వెళ్లి స్వామి వారి ఆశీస్సలు అందుకున్నారు. అలానే తమ అభిమానులకి మిఠాయిలు కూడా పంచారు.
