RTC Strike | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో చిచ్చుపెట్టిందా? ముఖ్యనేత, రవాణాశాఖ మంత్రి పొన్నం మధ్యం వైరంగా మారిందా? కార్మికుల సమ్మెకు రవాణాశాఖ మంత్రి వైఖరే కారణమని ముఖ్యనేత వర్గం అంటే.. కాదు ముఖ్యనేత ఒంటెద్దు పోకడే కారణమని ఆ మంత్రి అనుచరవర్గాలు ఆరోపిస్తున్నాయా? మంత్రికి తెలియకుండానే ముఖ్యనేత ఐఏఎస్ అధికారుల కమిటీని వేశారా? ఉప ముఖ్యమంత్రితో వేసిన కమిటీలోనూ ఆయనకు నామమాత్ర పాత్రే ఇచ్చారా? సమ్మెను అడ్డుపెట్టుకొని పొన్నంకు పొగపెట్టే ఎత్తులు వేస్తున్నారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ముఖ్యనేత వర్గం సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం చూస్తే వీటికి ‘అవును’ అనే సమాధానమే వినిపిస్తున్నది.
మంత్రికి తెలియకుండానే కమిటీ
సమ్మె నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 21న నలుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. రవాణాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ చైర్మన్‌గా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కన్వీనర్‌గా, కార్మికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలను సభ్యులుగా నియమించింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమేయం లేకుండానే ఈ కమిటీని వేశారని, దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారని ప్రచారం జరుగుతున్నది.
రాష్ట్రంలో సమ్మెలు జరిగిన ప్రతిసారీ ముఖ్యనేత సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయా శాఖల మంత్రులతో కాకుండా తన షాడోలను చర్చలకు పంపుతున్నారని మంత్రి పొన్నం అనుచరులు ఆందోళన వ్యక్తంచేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. సినిమా కార్మికులు సమ్మె చేసినప్పుడు, సినిమా టికెట్ల ధరల పెంపుపై డిమాండ్ పెరిగినప్పుడు కూడా ఇలానే చేశారని, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి తెలియకుండానే నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారట. ఇప్పుడు ఆర్టీసీ జేఏసీతో చర్చలకు కూడా ఆ శాఖ మంత్రికి తెలియకుండా కమిటీ ఏర్పాటు చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.
పొన్నంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్
పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి తప్పిస్తారని, ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు పదవి ఇస్తారని ఆరు నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ముఖ్యనేత కనుసన్నల్లో నడిచే ఒక వర్గం సోషల్ మీడియాలోనే ఈ ట్రోలింగ్ వైరల్ అవుతూ వస్తున్నట్టు చెప్తున్నారు. వాస్తవానికి మంత్రి ఇప్పటివరకు నేరుగా కార్మిక సంఘాలతోనే మాట్లాడలేదని, ముఖ్యనేత అందుకు అవకాశమివ్వలేదని పొన్నం వర్గం వాదిస్తున్నది. ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చినప్పుడు, ఆ సమ్మె నిర్వీర్యానికి జేఏసీయేతర నేతలతో మాట్లాడాలని సీఎంవో కార్యాలయం నుంచి మంత్రికి ఆదేశాలు వచ్చినట్టు చెప్తున్నారు.
ఈ మేరకు కార్మిక జేఏసీలో లేని ఏడుగురు కార్మిక సంఘాల నేతలను వ్యక్తిగతంగా పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. నిరుడు మే నెలలో కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చాయి. అప్పుడు పాలకులు ‘విభజించు.. నిర్వీర్యపరుచు’ అనే సూత్రం ప్రయోగించి సమ్మెను నిలువరించారు. మళ్లీ అదే ప్రయోగం చేయాలని భావించారు. అయితే ఈ రహస్య సమావేశాలను పసిగట్టిన ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలతో ప్రభుత్వ ఎత్తులను బట్టబయలు చేసింది. దీంతో ఆర్టీసీ కార్మికులు అప్రమత్తమయ్యారు. ఆయా సం ఘాల నేతలపై ఒత్తిడి తెచ్చారు.
ఫలితం గా అనివార్యంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. దీంతో మంత్రి ఉద్దేశపూర్వకంగానే కార్మికులను సమ్మెకు ప్రేరేపించారని ముఖ్యనేత వర్గం ఆరోపిస్తున్నది. సమ్మెకు సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందకుండా మంత్రి అడ్డుకున్నారని, ప్రతిపక్ష పత్రికలకు లీకులు ఇస్తున్నారని ముఖ్యనేత వర్గం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈ అనుమానాల నేపథ్యంలోనే రవాణాశాఖ మంత్రి ప్రమేయం లేకుండానే ఐఏఎస్‌ల కమిటీని వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార ఆధ్వర్యంలో వేసిన మంత్రుల కమిటీలోనూ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు స్థానం కల్పించినా, కార్మిక సంఘాలతో చర్చల్లో నామమాత్రపు అధికారాలే ఇచ్చారని ఆయన అనుచరులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
