Hansika | సినీ పరిశ్రమలో విడాకులు, బ్రేకప్స్ ఇప్పుడు సాధారణమవుతున్న నేపథ్యంలో ప్రముఖ నటి హన్సిక మోత్వానీ వ్యక్తిగత జీవితం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భర్త సోహైల్ ఖతురియాతో విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఆమె, తన వైవాహిక జీవితం, తీసుకున్న నిర్ణయం, మానసిక పరిస్థితి గురించి ఓపెన్‌గా మాట్లాడారు. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టిన హన్సిక, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. టాలీవుడ్లో దేశముదురు సినిమాతో ఎంట్రీ ఇచ్చి, “కందిరీగ”, “బిల్లా”, “మస్కా”, “కంత్రీ”, “దేనికైనా రెడీ” వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక దశలో తమిళ స్టార్ హీరో శింబుతో ప్రేమలో ఉండి, తర్వాత బ్రేకప్ అయిన విషయం తెలిసిందే.
కాలక్రమంలో కెరీర్లో కొంత వెనుకబడిన హన్సిక, వ్యక్తిగత జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుని తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్ ఖతురియాతో వివాహం చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత కొద్ది కాలానికే ఇద్దరి మధ్య మనస్పర్ధలు నెలకొన్నట్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో ఫోటోలు డిలీట్ చేయడం, వేర్వేరుగా కనిపించడం వంటి అంశాలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. చివరకు పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తాజా ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ, “ప్రస్తుతం నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒంటరిగా ఉండటం నాకు ఇష్టం. నా వాళ్లతో సమయం గడపడం, నాకు నచ్చినట్లుగా జీవించడం చేస్తున్నాను. ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం లేదు. విడాకులు తీసుకున్నందుకు నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. రాంగ్ ట్రైన్ ఎక్కామనిపిస్తే వెంటనే దిగిపోవడం మంచిది” అని అన్నారు.
మీడియాలో వస్తున్న వార్తలపై స్పందిస్తూ, ప్రజలకు కావాల్సింది హెడ్‌లైన్స్, క్లిక్‌బైట్స్. నా గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ నేను ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు, ఇవ్వను కూడా. నా జీవితం గురించి ప్రజల అభిప్రాయాల కంటే నా ఆరోగ్యం, నా సంతోషమే ముఖ్యం అని స్పష్టం చేశారు. విడాకుల సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుంటూ, “నా తల్లి, సోదరుడు ఈ కష్టకాలంలో నాకు ఎంతో సహాయం చేశారు. నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికి వారు మద్దతుగా నిలిచారు” అని తెలిపారు. అలాగే తన మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు, థెరపీ తీసుకున్నట్లు కూడా వెల్లడించారు. గత రెండేళ్లు నా జీవితంలో చాలా ముఖ్యమైనవి. ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. ఎలాంటి పరిస్థితినైనా ఎలా ఎదుర్కోవాలో అర్థమైంది. ఇద్దరి మధ్య జరిగే విషయాన్ని మూడో వ్యక్తి పూర్తిగా అర్థం చేసుకోలేడు అని హన్సిక అన్నారు.
